ఎంఈవోల నియామాకాల్లో ఇష్టాసారంగా డీఈవో ఉత్తర్వులు
పలుకుబడి, ఆమ్యామ్యాల ప్రకారం ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 11 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో ఎంఈవోల నియామక ఉత్తర్వుల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఇష్టానుసారంగా ఉత్తర్వులు జారీచేశారని ఆరోప ణలు వెలువడుతున్నాయి. కామన్ సీనియార్టీ వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో గతంలో పనిచేసిన ఎంఈవోలను మార్చరాదని ఉన్నతాధికారులు ఆదేశించారు. గతం లో పనిచేసిన ఎంఈవో మదర్ మండలాన్ని మారిస్తే ఎంఈవో బాధ్యత తొలిగినట్లవుతుంది.
మదర్ మండలాన్ని కొనసాగిస్తూ కొత్త మండలాలను కేటాయిస్తే ఎంఈవో బాధ్యతలకు భంగం వాటిల్లదు. జిల్లాలో కొందరికి ఒకే మండలం, మరి కొందరికి మూడు, నాలుగు మండలాలు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. పలుకుబ డి, ఆమ్యామ్యాల ప్రకారం ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా నుంచి బదిలీ అయిన ముగ్గురికి ఎంఈవోలుగా ఉత్తర్వులిచ్చిన డీఈవో.. ఇద్దరు ఎంఈవోలకు మదర్ మండలాలను తొలగించారు. వారికి ఎంఈవో హోదా పోతుందని, అలాంటివారికి ఇతర మండలాలు ఎలా ఇస్తారనే చర్చ ఉపాధ్యాయవర్గాల్లో సాగుతోంది.
గతంలో అశ్వారావుపేట ఎంఈవోగా పనిచేసిన కృష్ణయ్య మదర్ మండలం అశ్వారావు పేటతోపాటు గుండాల, ఆళ్లపల్లిలో అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయనను ప్రస్తుతం అశ్వారావుపేట నుంచి తొలగించి గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు మండలాలు కేటాయించారు. అదేవిధంగా జుంకీలాల్ గతంలో చర్ల ఎంఈవోగా పనిచేస్తూ కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతన గర్, లక్ష్మిదేవిపల్లికి ఎంఈవోగా పనిచేశారు. ఆయనను చర్ల నుంచి తొలగించి కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మిదేవి పల్లి మండలాలకు విద్యాధికారిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా ఎంఈవోల ఉత్తర్వుల్లో పారదర్శకత లోపించిందని విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై డీఈవో వెంకటేశ్వరచారిని వివరణ కోరగా.. కొత్తవారికి బాధ్యతలు ఇవ్వకూడదని, పాతవారిని కొత్త మండ లాలకు నియమించవచ్చునని చెప్పారు.