- ఎంవీ యాక్టును మరింత బలోపేతం చేస్తాం
- 5 నెలల్లో 6,936 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- వెహికిల్ ఫిట్‌నెస్ అంశంలో రాజీ పడం
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోటారు వాహన(ఎంవీ యాక్ట్) చట్టాన్ని భవిష్యత్తులో మరింత కఠినంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం ఏర్పా టు చేసిన రవాణా శాఖ సాంకేతిక అధికారు ల సర్వసభ్య సమావేశంలో మంత్రి ప్రసంగించారు. గత 5 నెలల్లో 6,936 డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశామన్నారు.డ్రంకెన్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, సిగ్నల్ జంపింగ్ వంటి అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై లైసెన్స్‌ల రద్దుతో పాటు మరింత కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
అమెరికా, యురోపియన్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అత్యంత కఠినంగా శిక్షిస్తారని, ఇక్కడ కూడా అటువం టి చట్టాలు తెచ్చి ప్రమాదాలను నివారించే విధంగా రవాణా శాఖ తమ పనితీరులో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందనే భయం పౌరుల్లో రావాల్సి ఉందన్నారు. రోడ్ సేఫ్టీఫై యూనిసెఫ్‌తో పాటు ప్రభుత్వం సైతం విద్యాశాఖ ద్వారా పాఠశాలల్లో అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, కనీస జాగ్రత్తలతో అనేక ప్రమాదాలను అరికట్టేందుకు అవకాశం ఉందన్నారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రోడ్డు భద్రతపై ఆవ గాహన కల్పించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో వారి పేరిట వాహన రిజిస్ట్రేషన్ కూడా లేకుండా చేస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడే అంశం లోనూ కఠినంగా వ్యవహరిస్తుందని, కాలం చెల్లిన వాహనాలను వది లించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల ఫిట్‌నెస్ అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
రవాణా శాఖ ఉద్యోగుల పదోన్నతుల్లో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వినియోగదారులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా సేవలు అందేలా చూస్తూ శాఖ ఆదాయాన్ని మరింత పెంచుతామని పొన్నం తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కమల్‌కాంత్, తదితరులు పాల్గొన్నారు.