calender_icon.png 6 November, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త చట్టాలతో హక్కులకు భంగం

03-08-2024 03:34:50 AM

  1. హక్కులకు భంగం కలిగించేలా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటాం 
  2. సత్వర న్యాయం కోసమే సివిల్ కోర్టుల చట్టాన్ని సవరిస్తున్నాం 
  3. శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
  4. ‘తెలంగాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు-కు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన న్యాయ చట్టాలను యథాతథంగా అమలు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో ‘తెలంగాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు- ప్రవేశపెట్టగా.. కేంద్ర న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆ చట్టాలతో తెలంగాణ ప్రజల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ..  కేంద్ర న్యాయ చట్టాలు పౌర హక్కులకు భంగం కలిగించేలా ఉంటే వాటిని సవరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర న్యాయవ్యవస్థ కేంద్ర న్యాయ చట్టాల్లో లోటుపాట్టను పరిశీలిస్తున్నదన్నారు. -ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే తమ ప్రభుత్వం సివిల్ కోర్టుల సవరణ బిల్లు- ప్రవేశపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల శిథిల భవనాల్లో కోర్టులు కొనసాగుతున్నాయని బీజేపీ సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కొత్త భవనాలు నిర్మించేందుకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు.

జిల్లా కోర్టుల్లో ప్రస్తుతం 8,91,598 కేసులు పెండింగులో ఉన్నాయని, సిబ్బంది కొరతను పరిష్కరించి కేసులకు సత్వర పరిష్కారం లభించేలా చూస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తాము ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే అవకాశం లేకపోయిందని, ధర్నాకు ముందురోజే పోలీసులు తమను గృహనిర్బంధం చేసేవారని గుర్తుచేశారు.

వెయ్యి కోట్లతో హైకోర్టు నిర్మాణం..

హైకోర్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని, రాష్ట్రం గర్వపడేలా వంద ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ వర్సిటీ భూమిని హైకోర్టు నిర్మాణానికి తీసుకున్నా వ్యవసాయ పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలగదన్నారు. యూనివర్సిటీ భూమిలో హైకోర్టు నిర్మించొద్దని, మరోచోట నిర్మించాలని బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ సూచిస్తున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వర్సిటీ భూమిలో హైకోర్టును నిర్మించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. వ్యవసాయ పరిశోధనలకు  అవసరమైతే మరోచోట రెట్టింపు స్థలాన్ని కేటాయించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

సైబర్ నేరాలను అరికట్టడానికి అవసరమైతే కొత్త చట్టాలు

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వ కార్యాచరణను వివరించాలని బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ కోరారని, ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా తమ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సైబర్ నేరాల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా 30 వరకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయని, అవసరమైతే వాటి సంఖ్యను మరింత పెంచుతామని బదులిచ్చారు.

పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే కూనం నేని

రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని నిప్పులు చెరిగారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలి.. ఏ విధంగా సవరించాలి.. అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఎమ్మెల్యే కూనంనేని ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. హోం శాఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్నారని, ఆయన పోలీసు విధుల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. పోలీసులు ఎక్కడైనా స్పందించినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎవరైనా శాంత్రి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.