calender_icon.png 20 October, 2024 | 3:06 AM

కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే జైలు తప్పదు

20-10-2024 01:19:30 AM

సహకార శాఖ కమిషనర్‌ను హెచ్చరించిన హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అవకతవకలపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను సహకార శాఖ కమిషన ర్, రిజిస్ట్రార్ అమలు చేయకపోవటంపై హైకో ర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.

కోర్టు ధిక్కార పిటిషన్లో నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పం దించలేదని ప్రశ్నించింది. వ్యక్తిగత హాజరుకు ఆదేశించాక నివేదిక అందజేయడం చట్ట ప్రకా రం ప్రాథమికంగా కోర్టు ధిక్కరణే అవుతుందని వ్యాఖ్యానించింది. కావాలనే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లు తేలితే శిక్ష తప్పదని హెచ్చరించింది.

హౌసింగ్ సొసైటీ గత మేనేజింగ్ కమిటీ అవకతవకలపై విచారణ జరిపి సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే అధికారులు అమలు చేయలేదంటూ ఆ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్  భాస్కర్‌రెడ్డి ఇటీవల విచారించారు. విచారణకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్  హరిత వ్యక్తిగతంగా హాజరయ్యారు.

విచారణ నివేదికను పిటిషనర్‌కు అందజేశామని, కౌంటర్ వేస్తామని ఆమె తరఫున ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాము ఆదేశించాక నివేదిక ఇవ్వడం కోర్టు ధిక్కరణే అవుతుందని న్యాయమూర్తి అన్నారు.  అధికారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. న్యాయవాది కల్పించుకుని అధికారి విధుల నుంచి రిలీవ్ అయ్యారని చెప్పగా, ఈ విషయాలన్నింటినీ తదుపరి విచారణలో వింటామని న్యాయ మూర్తి స్పష్టం చేశారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.