14-04-2025 12:29:31 AM
విను తెలంగాణ పుస్తకావిష్కరణలో వక్తలు
ముషీరాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి) : చారిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమం గొప్ప అనుభవమని, కానీ రాష్ట్ర ఆకాంక్షలకు అనుభవానికి చాలా అంతరం కనిపిస్తున్నదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగో పాల్ అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు కందుకూరి రమేష్ బాబు రచించిన ‘విను తెలంగాణ‘ పుస్తకావిష్కరణ కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రాణ త్యాగాలు చేసిన యువత స్ఫూర్తి ఏమయ్యిందని, మానవీయ తెలంగాణ కావాలనే స్వప్నాన్ని యువతకు అందించ లేకపోయారని హరగోపాల్ అన్నారు. తన 55 ఏళ్ల పౌర హక్కుల ఉద్యమంలో తనను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదని, తెలంగాణ వచ్చాక చిన్నపాటి విద్యా ఉద్యమం చేస్తే అరెస్ట్ చేశారని విచారం వ్యక్తం చేశారు.
రచయిత, కవి, దర్శకుడు బి.నరసింగరావు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమిస్తే, తెలంగాణ వచ్చాక గత పదేళ్లలో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం గద్దర్ తో పాటు తనకు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ జన ఆలోచనలకు సమస్యలకు విను తెలంగాణ పుస్తకం దర్పణం అని, వర్తమాన తెలంగాణను అర్ధం చేసుకోవడానికి ఇది దోహద పడతుందని ఆయన వివరించారు.
సమస్యలను విస్తృత ఆలోచనలతో జన బాహుళ్యంలోకి తీసుకెళ్లి తద్వారా రాజకీయ ఎజెండాగా మార్చగలిగితే ఫలితం ఉంటుందని, ఎవరికి వారు వారి పంథాలో కృషి చేయాలని కోరారు. రచయిత కందుకూరి రమేష్ బాబు మాట్లాడుతూ గత పదేళ్ల ప్రభుత్వం పై విమర్శ, ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్చరిక విను తెలంగాణ పుస్తకం అని వివరించారు. సీనియర్ పాత్రికేయులు రేమిల్ల అవధాని, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ పాల్గొన్నారు.