11-12-2024 02:27:24 PM
మేడిగడ్డ మరమ్మతులకు ఎన్డీఎస్ఏ అనుమతి అవసరం లేదు
హైదరాబాద్: కాళేశ్వరం మరమ్మతులకు ఎన్డీఎస్ఏ అనుమతి అవసరం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్ లో వినోద్ కుమార్ బుధవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టుకు ఎవరి అవసరం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టుకు మాత్రమే ఎన్డీఎస్ఏ అనుమతి అవసరమని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు ఎన్టీఎస్ఏ అనుమతి అవసరం లేదన్న బోయినపల్లి వినోద్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు మాత్రమే చేయగలుగుతోందన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ప్రవహిస్తోందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీరు ఎలా ఇస్తారో చెప్పాలి? అని ప్రశ్నించారు. గతవారం మేడిగడ్డ సమీపంలోనే 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినా.. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమీ కాలేదని సూచించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత ఎలా ఉందో ప్రకృతి, సృష్టి పరీక్షించిందని చెప్పారు. మేడిగడ్డ నీరు ఎత్తిపోసి రైతులకు యాసంగి పంటలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.