calender_icon.png 22 January, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వినోద్!

12-07-2024 02:36:34 AM

వరంగల్ ఎమ్మెల్సీ ఓటమికి బదులు తీర్చుకునేలా గులాబీ బాస్ ముందస్తు వ్యూహం

బీఆర్‌ఎస్ పార్టీ స్థాపనలో వినోద్‌ది కీ రోల్

కరీంనగర్, జూలై 11 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ను దించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో.. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడి నుం చి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు టీ.జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం మార్చి 29, 2025తో ముగియనుంది.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ వచ్చే సంవత్సరం జనవరి నుంచి ప్రారంభమవుతుంది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఇటు పట్టభద్రుల ఎన్నికల్లో, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఎవరినీ బరిలో ఉంచలేదు. అప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రవాణాశాఖ అధికారి చ్రందశేఖర్‌గౌడ్‌కు ఆ పార్టీ బయట నుంచి మద్దతు ప్రకటించింది. అయితే ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు..

టికెట్ కోసం పోటీ పడ్డా పార్టీ తరపున ఎవరినీ బరిలో ఉంచలేదు. ఇటీవల జరిగిన వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన తీన్మార్ మల్లన్న గెలిచిన క్రమంలో.. కరీంనగర్ నియోజకవర్గంపై ముందస్తుగానే బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. ప్రశ్నించే గొంతుకగా వినోద్ కుమార్‌ను బరిలో ఉంచాలని యోచిస్తోంది. వినోద్ కుమార్ 2004 నుంచి 2008 వరకు హన్మకొండ పార్లమెంట్ నుంచి, 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 

2019, 2024లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతిలో ఓట మి పాలయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వినోద్‌కుమార్‌ను ఎమ్మెల్సీ బరిలో ఉంచితే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆయనను బరిలో నిలిపితే పార్టీకి లాభం జరుగుతుందని భావిస్తున్నారు. ఎంపీ ఎన్నికల సమ యంలో భగత్‌నగర్‌లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని విస్తృత ప్రచారం చేసినప్పటికీ ఆయన ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమయ్యారు.