చంఢీగడ్: హర్యానా సివంగి వినేశ్ ఫొగా ట్ తన సొంత గ్రామం హర్యానాలోని బలాలికి చేరుకుంది. తనకు రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్పిన తన పెద్దనాన్న మహవీర్ సింగ్ ఫొగాట్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతం అయింది. అంతకు ముందు వినేశ్ చేసిన పోస్టులో మహవీర్ సింగ్ గురించి ప్రస్తావించకపోవడంతో చాలా మంది విమర్శలు చేశారు. కానీ వినేశ్ మాత్రం తన సొంతూరికి వెళ్లగానే తన పెద్దనాన్నను కలిసింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామానికి వచ్చిన వినేశ్‌కు గ్రామస్తులు అదిరిపోయే స్వాగతం పలికారు. రూ. 21 వేలు జమ చేసి వినేశ్‌కు కానుకగా అందించారు. అంతే కాకుండా 750 కేజీల లడ్డూలను తయారు చేశారు. ఆ లడ్డూలను గ్రామం మొత్తం పంచి సంబరాలు చేసుకున్నారు.
బలాలి బిడ్డలు రికార్డులు కొల్లగొట్టాలె
స్వగ్రామానికి చేరుకున్న వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ.. బలాలి నుంచి తన కంటే గొ ప్ప రెజ్లర్లు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బలాలి నుంచి వచ్చిన రెజ్లర్లు రికార్డులను తిరగరాయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన కంటే ఎంతో విజయవంతం కావాలన్నారు. అంతకు ముందు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వినేశ్‌కు అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే.