చెరువులో విల్లాలు.. మునిగిన కొనుగోలుదారులు
- అమెరికాకు పారిపోయేందుకు యత్నం.. ఎయిర్‌పోర్టులో పట్టివేత
- దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
మేడ్చల్, జనవరి 30 (విజయ క్రాంతి): దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో అక్రమంగా విల్లాలు నిర్మిం చి అనేక మందిని మోసంచేసిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని గురువారం పోలీసులు అరె స్టు చేశారు. మోసానికి పాల్పడినందున ఆమెపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
అప్పటినుంచి ఆమె పరారీలో ఉన్నారు. దాంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి అమెరికా వెళ్లడానికి విజయలక్ష్మి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తమై దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విల్లాల అక్రమ నిర్మాణం
మల్లంపేటలోని 75/3,175/4,175/5 సర్వే నెంబర్లలో కేవలం 60 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకొని 260 విల్లాలను నిర్మించిన విజయలక్ష్మి, ఒక్కో విల్లాను కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు విక్రయించారు. మల్లంపేటలోని కత్వ చెరువు శిఖం, బఫర్ జోన్లను ఆక్రమించి వాటిని నిర్మించారు.
బఫర్‌జోన్‌లో విల్లాలు నిర్మిస్తున్నారని 2021లోనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. అయితే అప్పట్లో హైడ్రా వంటి వ్యవస్థ లేదు. విజయలక్ష్మికి అధికార పార్టీ అండదండలు ఉండడం తో అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు.
11 విల్లాలు కూల్చేసిన హైడ్రా
కత్వ చెరువులో బఫర్‌జోన్‌లో విల్లాలు నిర్మిస్తున్నారని అధికారులు నోటీసులు జారీచేసినా విజయలక్ష్మి పట్టించుకోలేదు. నిర్మా ణాలు యధావిధిగా కొనసాగించింది. అంతేగాక వీటిని అమాయకులకు అంటగట్టింది. హైడ్రా ఏర్పాటైన తర్వాత సర్వే చేసి బఫర్‌జోన్‌లో నిర్మించిన వాటిని గుర్తించారు.
2024 సెప్టెంబర్ 7న హైడ్రా అధికారులు 11 విల్లాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇళ్లలో నివసిస్తున్న వారికి ఎలాంటి నోటీసు లు ఇవ్వలేదు. అధికారులు నేరుగా బుల్డోజర్లతో రావడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటూ సామాన్లు బయట పెట్టుకున్నారు.
కనీస సదుపాయాలు కరువే
విల్లాలలో విజయలక్ష్మి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. కొనుగోలు సమయంలో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినా.. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మించనేలేదు. డ్రైనేజీ, కరెంటు, నీటి వసతి కల్పించలేదు. కనీస వసతులు కల్పించలేదని కొనుగోలుదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విజయలక్ష్మిపై 2021 నుంచి కేసులు
విజయలక్ష్మిపై 2021 నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అప్పటినుంచి పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ చర్యలు తీసుకోలేకపోయారు. 2021లో రెండు కేసులు, 2022 లో ఒక కేసు, 2024లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
విజయలక్ష్మికి 14 రోజుల రిమాండ్
విజయలక్ష్మికి మేడ్చల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆమెను చెంచల్‌గూడ జైలుకు తరలించారు.
రాజకీయ అండతోనే..
విజయలక్ష్మి రాజకీయ అండతోనే మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021లోనే ఆమెపై ఫిర్యాదు లు వచ్చాయి. కానీ అప్పటి ప్రజాప్రతినిధులు ఆమెకు అన్ని విధాలా సహకరించారు. అధికారులు విల్లాల వైపు వెళ్లకుం డా అడ్డుకున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అధికార పార్టీ నాయకుల సహకారం, అండదండలతో ఆమె యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు.