calender_icon.png 20 March, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్య బారిన పడుతున్నాం.. రోడ్డు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు

19-03-2025 09:11:47 PM

- పలుమార్లు నిరసన తెలిపినా పట్టించుకోని అధికారులు..

- ఏళ్ళు గడుస్తున్న పూర్తికాని రహదారి నిర్మాణ పనులు..

టేకులపల్లి, (విజయక్రాంతి): సుందరీకరణ పేరుతో సింగరేణి యాజమాన్యం టేకులపల్లి మండల కేంద్రంలోని కోయగూడెం ఉపరితల గనికి వెళ్లే రహదారిలో రేగుల తండా నుంచి దాస్ తండా వరకు సెంట్రల్ లైటింగ్ డివైడర్ రహదారి నిర్మాణాన్ని గత ప్రభుత్వం బిఆర్ఎస్ హాయంలో ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రహదారి పనులు మాత్రం తొలిదశలోనే నిలిచిపోయాయి. కోయగూడెం కేఓసి నుంచి వచ్చే భారీ బొగ్గు వాహనాలతో ఎగసిపడే దుమ్ము దూళితో గ్రామస్తులు అనారోగ్యం పాలవుతూ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురై అనేక ఇబ్బందులకు గురయ్యారు.

అయినప్పటికీ అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేకపోవడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. గ్రామస్తులు పలుమార్లు నిరసన తెలిపినప్పటికీ అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తూ కాలక్షేపానికి మాత్రమే పరిమితమయ్యారని సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఎన్నిసార్లు నిరసన తెలిపిన ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురై ఏకంగా నడిరోడ్డుపై టెంటు వేసి బుధవారం నిరసనలు తెలిపారు.

500 మీటర్ల రహదారి నరకానికి రహదారిగా మారిందని నిత్యం వందల సంఖ్యలో తిరిగే వాహనదారులు మాత్రం తమ వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారుల శరీరాలు గుల్ల గుల్లగా నలిగిపోతున్నాయని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసిన రాని అలసట కేవలం 500 మీటర్ల దూరం ప్రయాణిస్తే అలసట శరీర నొప్పులు ఏర్పడుతున్నాయని వాహనదారులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి యాజమాన్యం మాత్రం లక్షల కోట్లు మండల సంపదలను కొల్లగొడుతూ మండల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండల ప్రజల సింగరేణి యాజమాన్యంపై మండిపడుతున్నారు. దాస్ తండా, రేగుల తండా గ్రామస్తులు ఎగసిపడే దుమ్ము ధూళిని  పీలుస్తూ అనారోగ్య పాలవుతున్నారు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని  జర మా రోడ్డుని పూర్తి చేయండని గ్రామస్తులు వేడుకుంటున్నారు.