28-02-2025 01:42:01 AM
చెట్లు నరకడంపై గ్రామస్థుల ఆగ్రహం
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కార్యదర్శి రాజు
కల్లూరు /ఫిబ్రవరి 27(విజయ క్రాంతి ): ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి హరితహారం పేరుతో గ్రామాల్లో పట్నాలలో... పల్లె ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటుంది. అయితే కొందరు అక్రమార్కులు స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉన్న చెట్లని నరకడం తీవ్ర ఆగ్రహానికి లోను చేస్తుంది.
ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలా జరగటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరికి వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో పేరువంచ గ్రామపంచాయతీ కార్యాలయంలో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 30 సంవత్సరాల పెద్ద చెట్లను నరికి ఎత్తుకుపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హరితహారం పేరుతో మొక్కలు నాటిస్తుంటే ఉన్న మొక్కలు నరకటం ఏమిటని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీసర రవీందర్ రెడ్డి, మెంతుల అనిల్ ప్రశ్నించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏ సభలు సమావేశాలు పెట్టుకున్న చక్కటి నీడ నిచ్చే చెట్లు ఉండటం చాలా సంతోషం.కాసులకు కక్కుర్తి పడి ఆ సంతోషం వద్దనుకున్నారు ప్రబుద్ధులు.
ఏకంగా గ్రామపంచాయతీ కార్యాలయంలోనే మొక్కలు నరకడం పై గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే చెట్లలను నరికారో దాని వెనుకున్న సూత్రధారులు ఎంతటి వారైనా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరు ముగ్గు వెంకటాపురం గ్రామానికి చెందిన ఒకరు, ముత్తగూడెం నకు చెందిన వ్యక్తి చెట్లను నరికినట్లు గ్రామస్తులు తెలిపారు.
బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం : కార్యదర్శి
ఈనెల 21వ తేదీన తాను సెలవులో ఉండగా తమకు తెలియకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికి వాటిని ఎత్తుకెళ్ళారని గ్రామ కార్యదర్శి రాజు వివరణ ఇచ్చారు.ఈ విషయంపై ఎంపీడీవో కు సమాచారం ఇవ్వడంతో వారి ఆదేశాలతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ 22 న ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. చెట్లు నరికిన వ్యక్తులను గుర్తించి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని కోరానని అన్నారు.