రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య
కలెక్టరేట్ ఎదుట కార్పొరేషన్ విలీన గ్రామ పంచాయతీల ప్రజలు ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పల్లె ప్రాంతాలను కార్పొరేషన్ లో కలపడం పేదలకు వ్యవసాయ కూలీలకు నష్టం సుజాతనగర్ లోని ఏడు గ్రామ పంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్ లో కలపొద్దని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాన ఐలయ్య డిమాండ్ చేశారు. ఏడు గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో కలపొద్దు అంటూ విలీన గ్రామపంచాయతీ ప్రజలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు పచ్చని మా గ్రామాలను కార్పొరేషన్ లో కలపొద్దు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం కార్పొరేషన్ లో ఏడు గ్రామపంచాయతీలను కలుపుతామని ప్రకటించిన తర్వాత సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీల ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ అన్నారు.
సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం సుజాతనగర్ మంగపేట కోమటిపల్లి లక్ష్మీదేవి పల్లి నరసింహసాగర్ నిమ్మలగూడెం గ్రామపంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్ లో కలపడం వలన ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కార్మికులు చిన్న సన్న కారు రైతులు నష్టపోతారని, అర్బన్ స్వభావం లేని ఈ గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో కలపడం వలన ఉపాధి హామీ పథకం రైతు భరోసా పథకం వంటివి రద్దయిపోయి వ్యవసాయ కూలీలు రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో సుమారు ఐదువేల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఉపాధి హామీ పథకం రద్దవ్వడం వలన వ్యవసాయ కార్మికుల బ్రతుకు కష్టంగా మారుతుంది.
ఉపాధి హామీ పథకం రద్దయితే వ్యవసాయ అనుబంధ పనులకు అవసరమైన లబ్ధి పొందే అవకాశం ఉండదు. సహకార సంఘాలు కూడా రద్దయిపోయి రైతాంగం ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ వ్యవసాయానికి ప్రభుత్వ సహకారం కోల్పోయే ప్రమాదం ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు వలన ఈ ఏడు గ్రామ పంచాయతీల ప్రజలకు పరిపాలన కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు ప్రతి చిన్న పనికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్పొరేషన్ ఆఫీస్ కి రావాల్సిన పరిస్థితి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఈ గ్రామాలను కార్పొరేషన్ లో కలపకుండా గ్రామపంచాయతీలు గానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సుజాతనగర్ మండలం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతుందని ఇంకా మండల కేంద్రంగానే సుజాతనగర్ అభివృద్ధి చెందలేదనీ రైతులు వ్యవసాయ కూలీలు చేతి వృత్తిదారులు అధికంగా ఉన్న ఈ ఏడు పంచాయతీలను కార్పొరేషన్ లో కలపడం వలన పేద మధ్యతరగతి ప్రజలపై అధిక పన్నుల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ప్రజలకు సంక్షేమ పథకాలు మరియు అందుబాటులో ప్రజా పాలన ఉండాలంటే సుజాత నగర్లోని ఈ ఏడు గ్రామపంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్ లో కలపొద్దని సుజాతనగర్ మండల కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఏడు గ్రామ పంచాయతీల విలీన వ్యతిరేక పోరాటానికి సిపిఎం మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిపాలిటీలను కార్పొరేషన్ గా అభివృద్ధి చేయడానికి సిపిఎం వ్యతిరేకం కాదని అలాగే అర్బన్ స్వభావం రాని పల్లె ప్రాంతాలను కార్పొరేషన్ లో కలపడం పేదలకు వ్యవసాయ కూలీలకు చిన్న సన్న కారు రైతులకు నష్టమని అన్నారు అందుకని పల్లె ప్రాంతాలను కార్పొరేషన్ లో కలపడానికి సిపిఎం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఏడు గ్రామ పంచాయతీల ప్రజలు భవిష్యత్తులో కొనసాగించే పోరాటానికి సిపిఎం మద్దతు ఉంటుందని ప్రభుత్వం కూడా పల్లె ప్రాంతాలను కార్పొరేషన్ లో కలిపే విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో రమాదేవికి వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శివరాం ప్రసాద్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు కాలంగి హరికృష్ణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కున్సోత్ ధర్మ సిఐటియు జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్ వీర్ల రమేష్ భూక్య రమేష్ తులసిరాం బచ్చలికూర శ్రీను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యాసా నరేష్ గండమాల భాస్కర్ నాగేష్ జియంపియస్ జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు రైతు సంఘం నాయకులు కృష్ణ పుల్లయ్య బాల వెంకటేశ్వర్లు మహిళా సంఘం నాయకులు కుమారి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.