“తాను ఇష్టపడ్డ అమ్మాయికి మనసులోని ప్రేమను చెప్పాలన్నా, ఆమె ఆ ప్రేమకు వెంటనే బదులివ్వాలన్నా సాధారణ విషయం కాదు. పల్లెటూళ్లో అయితే ఎవరెక్కడ చూస్తారోనని అమ్మాయి, అబ్బాయి ప్రేమ ఊసులు చెప్పుకోవటం మరీ కష్టం. అలాంటి కష్టాన్ని హాయిగా అనుభవిస్తున్న కుర్రాడు మనసులోని ప్రేమ గారడీని నచ్చిన అమ్మాయికి ఎలా చెప్పాడనేది తెలుసుకోవాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందే” అంటున్నారు మేకర్స్. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రమే ‘కమిటీ కుర్రోళ్ళు’.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు నిహారిక కొణిదెల సమర్పకురాలు. యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్స్ త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘ప్రేమ గారడీ...’ పాట బుధవారం విడుదలైంది. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు.