calender_icon.png 24 December, 2024 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరు - అడవి

09-09-2024 02:30:00 AM

బ్రహ్మాండంగా మండుతోంది ఎండ.గడ్డిపోచ లేకుండా మాడి రుద్రభూమివోలె కనిపిస్తున్నది నేల. నిప్పులా మండుతున్న ఎండలో నుంచి నడిచిపోతున్నా ను. నా శరీరంలోని సర్వశక్తులను ఎండ ఓడ్చివేసింది. దాహ బాధకు శరీరమంతా నీరసంగా ఉంది. ఎక్కడ నీరు జాడ కనపడడం లేదు, దప్పి తప్ప నాకు.

‘ఎంత కోపముంది’.

వేరే సంగతి స్మృతిలో లేదు. దూ రాన పచ్చచెట్ల క్రింద ఓ ఊరు కనుపించింది. పచ్చని చెట్లను, మనుష్యుల ఇళ్లను చూడటంతోనే వీరు త్రాగినట్టె కొత్త ప్రాణం వచ్చింది నాకు. ఊళ్లోకి పోయి ఒక ఇంటి ముందు ఆగి “దాహం” అని అరిచాను.

“ఏ ఊరు మీది?”

మొదలు మొదలు అడిగాడు ఆ యన దాహము కన్నా అది ము ఖ్యావసరమైనట్టు. దాహ బాధతో ఊరు, పేరు చెప్పబుద్ధి పుట్టలేదు నాకు. నేను మాట్లాడలేదు. 

ఆయన అట్లాగే నిలబడ్డాడు. పేరు చెప్పంది నీళ్ళు పోయనన్నట్టు. ఆయన అట్లా నిలబడడం నాకు బాగుండలేదు. కొంచెం సేపు నిలబడి ఇంకొక ఇంటికి పోయాను.

“ఎవరు మీరు?”

మళ్ళీ అదే ప్రశ్న.

మళ్ళీ అదే ప్రశ్న వినడం నాకు బాగనిపించలేదు. కొంచం కోపం వచ్చింది.

“నాకు దాహం వేస్తోంది” అన్నాను.

“ఎవరంటే మాట్లాడరెందుకు?”

“ఎవరైతే ఏమిటయ్యా... దాహము ఇయ్యటానికి?”

“ఎవరైంది చెప్పకూడదా?”

“దాహానికి ఎవరైతే ఏమిటి?”

“ఎవరని అడిగితే ఏమిటయ్యా? ఇంత బాధ ఏమిటయ్యా?”

అక్కణ్ణించి ఇంకో ఇంటికి పోయాను.

“మీ పేరేమిటి?”

మళ్ళీ అదే ప్రశ్న. నాకు మరీ కోపం వచ్చింది.

“ఎవరైతే ఏముంది?”

“కాదు ఏమి పేరు?”

“ఏదో ఒక పేరు”

“ఏమిటయ్యా... చెబుదూ?”

“అబ్బా! పేరు! పేరు! ఏ పేరైతే

ఏముంది?”

“అంత విసుగు ఎందుకయ్యా?”

“నీరు నీరు అని ప్రాణాలు వదులుతున్న వాణ్ణి పేరు- పేరు పేరు అని ఏడ్పిస్తారేమిటి?”

కోపంతో ఊరు దాటిపోయాను. ఊరు దాటిన వెనక, నా తెలివితక్కువ తనము, తొందరపాటు మీద నాకు కోపము వచ్చింది.

ఎందుకంటే, ఊరు పోయి అడవి వచ్చింది. అడవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఊరు పేరు అక్కర లేకున్న పొదలు, తీగెలు నీళ్ళు ఇచ్చేవి కావు. ఏమి చేయాలో నాకేమి తోచలేదు. పిచ్చివాడి మోస్తరు అట్టాగే పోతున్నాను. నా శరీరం నా వశం తప్ప దొడిగింది. నా కాళ్ళు తడబడ దొడగాయి. మృత్యువు ముంచుకొస్తున్నట్టు కళ్ళు చీకట్లు క్రమ్మదొడగాయి. దాహముతో అడవి మధ్య చచ్చిపోతానేమో అని భయం వేయ దొడగింది. ఇంతలో హఠాత్తుగా ఓ చిన్నవాగు ఎదురైంది. నా విగత జీవాలు వాగు రూపంలో ప్రత్యక్షమైనట్టు పొంగిపోయాను.

వాగులో బాటసారులు ఓ చెలమ తోడి ఉంచారు. చెలమలోకి తలవంచి అమృతము త్రాగినట్టు ఆ వీరంతా త్రాగేశాను. దాహానికి వీ రు దొరికినందుకు నాకు ఎంతో ఆనందమైంది. నీరు తాగుతూ తాగుతూ నాకు ప్రాణదానం చేసిన ఆ మూగతల్లికి కోటి నమస్కారాలు చేశాను.

కాని అన్నిటికన్నా నాకు మహా ఆనందం కలిగించిన విషయమేమిటంటే, ఆ చెలమ నా ఊరు పేరు గూర్చి ప్రశ్నలు వేయలేదని. ఇది ఏదో అసాధారణ విషయమని నాలో నేను అలౌకికానందంతో పొంగిపోయాను.

రచనా కాలం: 1953

‘కథా నిలయం’ సౌజన్యంతో..