- ఆదర్శంగా నిలుస్తున్న బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి
- రూ.1.50 కోట్లకు పైగా అభివృద్ధికి ఖర్చు
మహేశ్వరం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): సాధారణంగా ఏ గ్రామాన్నైనా సర్కార్ నిధులతో అభివృద్ధి చేస్తారు లేదా స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ గ్రామాభివృద్ధికి మాత్రం గణేశుడి లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులు ఖర్చు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1980లో మొదటిసారి బొజ్జ గణపయ్యను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత 1994లో మొదటిసారి లడ్డూ వేలం పాట ప్రారంభించారు. తొలిసారి జరిగిన వేలంలో వ్యవసాయదారుడైన కొలను మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. ఆ లడ్డూను ఆయన పొలంలో చల్లాడు. ఆర్థికంగా కలిసి వచ్చిందని భావించి తిరిగి 1995లో మరోసారి కొలను కుటుంబ సభ్యులు రూ.4,500కు లడ్డూను దక్కించుకున్నారు. అయితే, లడ్డూ దక్కించుకున్న వారికి బాగా కలిసొస్తుందని భక్తుల్లో నమ్మకం, విశ్వాసం పెరగడంతో లడ్డూ వేలం పాట లక్షల రూపాయలకు చేరుకుంది. 1994 నుంచి 2023 వరకు 30 మంది భక్తులు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది (2023)లో దాసరి దయా నంద్‌రెడ్డి అనే భక్తుడు రూ.27 లక్షలకు వేలం పాటలో లడ్డూను దక్కించుకోవ డం తో బాలాపూర్ లడ్డూ రికార్డు సృష్టించింది.
గ్రామాభివృద్ధికి కేటాయింపు..
బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుల్లో ఇప్పటి వరకు గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం, లక్ష్మీగణపతి ఆలయానికి రూ.28.55 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. అదేవిధంగా 130 గజాల స్థలంలో గణేశ్ మండపానికి రూ.66.50 లక్షలు, బాలాపూర్ ఉన్నత పాఠశాలకు రూ.1.45 లక్షలు, వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.12 లక్షలు ఖర్చు చేశారు. మహబూబ్‌నగర్‌లో వరద బాధితుల కోసం రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.
పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.34.09 లక్షలు, గణేశ్ చౌక్ కోసం రూ.90 వేలు ఖర్చు చేశారు. శివాలయం అభివృద్ధికి రూ.1.36 లక్షలు, మహంకాళి మందిర నిర్మాణం కోసం రూ.8.55 లక్షలు, మల్లన్న స్వామి ఆలయం కోసం రూ.లక్ష, కంఠమా మహేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం రూ.3 లక్షలు, అయ్యప్ప స్వామి సన్నిధానం కోసం రూ.6 లక్షలను గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు బాలాపూర్ గ్రామాభివృద్ధికి రూ.1,58,07,970 ఖర్చు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.