calender_icon.png 16 January, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విష జ్వరాలతో విలవిల

11-09-2024 12:00:00 AM

పల్లెలు, పట్టణాల్లో పెరిగిన జ్వరాలు

ప్రభుత్వ దవాఖానలకు పెరుగుతున్న రోగుల తాకిడి

ప్రతి 100 మందిలో 90 మందికి వైరల్ జ్వరాలే

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యాతో సతమతం

హైదరాబాద్ సిటీబ్యూరో, మెట్రో నెట్‌వర్క్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మంచం పడుతున్నారు. బస్తీ దవాఖాన మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా దవాఖానలతో పాటు గాంధీ, ఉస్మానియా, కోరంఠి ఫీవర్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలకు రోగుల తాకిడి పెరుగుతోంది. మొత్తం రోగులలో 90 శాతం వైరల్ జ్వరంతో బాదపడుతున్నవారేనని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాలలో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, ఒళ్లు, గొంతు  నొప్పులు, ఇన్‌ఫెక్షన్, స్కిన్ అలర్జీ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు జ్వరాలతో దవాఖాన బాట పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులైన ఫీవర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు జ్వర బాధితులు క్యూ కడుతుండడంతో బెడ్లు అన్ని నిండి ఉంటున్నాయి. 

ప్రతిరోజు 7,500 మంది రోగులు..

గాంధీ, ఉస్మానియా దవాఖానలకు గతంలో సగటున 2 వేల నుంచి 2,500 వందల మంది ఓపీ రోగులు వచ్చేవారు. కానీ ప్రస్తుతం రోజుకు 7,500 మంది (గాంధీకి 4,000 ఉస్మానియాకు 3,500 చొప్పున) ఓపీ రోగులు వస్తున్నారని, వీరిలో 90 శాతం మంది వైరల్ జ్వరాలతో వస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అలాగే నిలోఫర్‌లోనూ ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోరంఠి ఫీవర్ హాస్పిటల్‌లో సాధారణ రోజుల్లో 500 నుంచి 600 వరకూ వచ్చే ఓపీ రోగులు ప్రస్తుతం 900 నుంచి 1,100 వరకు వస్తున్నారు. 80 మంది రోగులతో పాటు మరో ఇద్దరు డెంగ్యూ పేషెంట్లు ఇన్ పేషంట్లుగా ఫీవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ఆర్‌ఎంవో డాక్టర్ జయలక్ష్మితెలిపారు. అలాగే గతంతో పోల్చితే జ్వరం, బాడీ పెయిన్స్‌తో మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలో డెంగ్యూతో ఆరుగురు మృతి

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరుగురు డెంగ్యూ జ్వరంతో మరణించారని జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు. గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌లో ప్రతి రోజు సుమారు 250 మంది, హుస్నాబాద్ ఏరియా దవాఖానలో 170, దుబ్బాక ఏరియా దవాఖానలో రోజుకు సుమారు 120 మంది, జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో ప్రతిరోజు 50 నుంచి 80 మంది వరకు వైరల్ జ్వరాలతో దవాఖానలలో చేరుతున్నారు.  

వికారాబాద్ జిల్లాలో 70 మందికి డెంగ్యూ పాజిటివ్

వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో మామూలు రోజుల్లో 350 నుంచి 400 ఓపీ పేషెంట్లు వచ్చేవారని, ప్రస్తుతం 500 నుంచి 600 మంది, పీహెచ్‌సీలకు 50 నుంచి 70 మంది ప్రజలు వైరల్ జ్వరాలతో వస్తున్నారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వికారాబాద్, పరిగి ఏరియా ఆసుపత్రుల్లో ఓపీ రెండింతలు పెరిగిందని వైద్యులు తెలిపారు. జిల్లాలో 70 వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులు ఉన్నాయని, ఎలాంటి మరణాలు సంభవించలేదని వైద్యులు వెల్లడించారు.

యాదాద్రి జిల్లాలో.. 

గడిచిన 15 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ఆలేరు, చౌటుప్పల్, రామన్నపేటలోని వైద్యవిధాన పరిషత్తు ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యానాయక్ తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకొని వైద్యం అందిస్తున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఇద్దరికి డెంగ్యూ నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు.  

రంగారెడ్డి జిల్లాలో 271 డెంగ్యూ కేసులు

రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 271 డెంగ్యూ కేసులు నమోదు కాగా, వీరిలో నలుగురు మృతిచెందారు. గతంలో వైరల్  ఫీవర్ బారినపడిన వారు చికిత్స తీసుకున్న మూడు, నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేవారని, ప్రస్తుతం వారం దాటినా కోలుకోవడం లేదని జిల్లా మలేరియా వైద్యాధికారి రాకేశ్ తెలిపారు. జిల్లాలో 28 పీహెచ్‌సీలు, 25 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 70 బస్తీ దవాఖానలు, 122 పల్లె దవాఖానలు ఉండగా ప్రతిరోజు 50 నుంచి వంద వరకు ఓపీ రోగులు వస్తున్నారని, ఏరియా దవాఖానలకు 3 వేల పైచిలుకు రోగులు జ్వరంతో వస్తున్నారని వైద్యాధికారులు తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో సరిపడా మందులు ఉంచుతున్నామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరావు పేర్కొన్నారు.

మంచం పట్టిన మెదక్..

మెదక్ జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 250 నుంచి 300 మంది ఓపీ రోగులు వైరల్ జ్వరాలతో వస్తున్నారు. అలాగే నర్సాపూర్ ఏరియా హాస్పిటల్, తూప్రాన్, రామాయంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా వ్యాప్తంగా 157 సబ్ సెంటర్లు, 20 పీహెచ్‌సీ వద్ద రోగుల తాకిడి పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 28 డెంగ్యూ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారు. డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియాతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం వందల సంఖ్యలో చేరుతున్నారు. అలాగే టైఫాయిడ్ కేసులు 157 నమోదు కాగా, మొత్తంగా వైరల్ ఫీవర్ కేసులు 2,576 నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.  


90 శాతం వైరల్ జ్వరాలే.. 

సాధారణ రోజుల్లో 500కు పైగా సరాసరి ఓపీ నమోదవుతుంది. ప్రస్తుతం 900 నుంచి 1100 వరకు ఓపీ నమోదవుతోంది. గత వారంలో అత్యధికంగా 1,100 మంది రోగులు వచ్చారు. ప్రస్తుతం వచ్చే ఓపీ పేషెంట్లలో 90 శాతం వైరల్ జర్వాల కేసులే ఉన్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు తదితర లక్షణాలతో కూడిన రోగులే అధికంగా ఉంటున్నారు. 

 డాక్టర్ జయలక్ష్మి, 

ఫీవర్ ఆసుపత్రి ఆర్‌ఎంవో  

నడవలేని పరిస్థితి ఉంది

నేను అలియాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తాను. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కాళ్లు, చేతులు చల్లబడ్డాయి. స్థానికంగా ఉండే డాక్టర్ వద్దకు వెళ్తే ఫీవర్ హాస్పిటల్‌కు వెళ్లమంటే ఇక్కడకు వచ్చాను. కదల్లేక పోతున్నాను. చికున్ గున్యా అయి ఉంటుందని అంటున్నారు. 

 ప్రియ, అలియాబాద్