16-04-2025 11:22:31 AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) తిరుమల వెంకన్నను దర్శించుకుని, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే కొందరు నెటిజన్లు పుణ్యక్షేత్రాల్లో మహిళలు తలనీలాలు సమర్పించడం సరికాదంటూ నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ(Congress Party MLC), ప్రముఖ నటి విజయశాంతి(Vijayashanti ) ఎక్స్ వేదికగా సీరియస్ అయ్యారు.
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదం నుంచి కుమారుడు మార్క్ శంకర్ బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమల(Tirumala Tirupati Devasthanams)లో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.