calender_icon.png 13 October, 2024 | 1:32 PM

జమ్మి పూజ చేసి.. పాలపిట్ట చూసి..

13-10-2024 11:16:34 AM

ఘనంగా దసరా వేడుకలు 

గ్రామాల్లో పండుగ సందడి 

కొత్తగూడెం: విజయదశమి (దసరా) పండుగ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలోని కోదండ రామాలయం, బ్రహ్మంగారి వీధిలో, బోడు, కోయగూడెం గ్రామాల్లో దశమి వేడుకలు నిర్వహించారు. "శమీ శమీయతే పాపం.. శమీ శత్రువినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియదర్శిని." అని శమీ పూజను జమ్మి చెట్టు వద్ద చేశారు. తమ పేర్లు రాసిన పత్రాలను పూజల అనంతరం జమ్మి చెట్టు వద్దనే దానం చేసి వచ్చే ఏడాది వరకు పాడిపంటలతో ప్రతి ఇల్లు కలకల్లాడాలని వేడుకున్నారు. అనంతరం అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో ఏర్పాటుచేసిన ట్రాక్టర్లపై ఉంచి భారీ లైటింగ్ సెట్టింగ్లతో ఊరేగింపు చేశారు. బాణాసంచ కాలుస్తూ యువతీ యువకులు డ్యాన్సులతో సందడి చేశారు. నవరాత్రులు వివిధ రూపాలలో అమ్మవారిని కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన వస్త్రాలను వేలం వేసి భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది ఇంకా వేసిన పంటలు చేతికి రాకపోవడంతో కొన్ని గ్రామాల్లో దసరా పండుగ సందడి కనిపించలేదు. అమ్మవారి మందిరాల వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలకు భక్తులు పూజలు చేయించారు. దసరా వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టేకులపల్లి,  బోడు పోలీస్ స్టేషన్లో పరిధిలోని గ్రామాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.