19-04-2025 12:10:31 PM
కేసముద్రం బల్దియాలో తొలగిన ఇబ్బంది
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం బల్దియా(Kesamudram Baldia) పరిధిలో ఆస్తుల వివరాలను సీడీఎంఏ (కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) పోర్టల్ లో నమోదు చేయకపోవడంతో ఆస్తుల వివరాలు డిస్ప్లే కాకపోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలకు ఆటంకంగా మారింది. ఈ అంశంపై ఈనెల 3న ‘విజయ కాంతి’ దినపత్రికలో(Vijaya Kanthi daily newspaper) ‘కేసముద్రం బల్దియాలో రిజిస్ట్రేషన్ లకు బ్రేక్!’ శీర్షికతో ప్రచురించిన ప్రత్యేక వార్తా కథనానికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పట్టణ పరిధిలోని ఆస్తుల వివరాలు సిడిఎంఏ ఆన్లైన్ పోర్టల్ లో శుక్రవారం రాత్రి పొందుపరిచారు. గత ఏడాది డిసెంబర్ నెలలో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, దనసరి, అమీనాపురం, సబ్ స్టేషన్ తండ పంచాయతీలను కలిపి కేసముద్రం మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ ఏడాది జనవరి 28న కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసముద్రం మున్సిపాలిటీ విలీన గ్రామాలకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) వివరాలను సీడీఎంఏ పోర్టల్ లో నమోదు చేయకపోవడంతో గడచిన రెండు మాసాలుగా కేసముద్రం మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు స్తంభించాయి. ఈ విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ‘విజయ క్రాంతి’ పత్రికలో ప్రచురించడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు(State Municipal Department officials) స్పందించి కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తులను సిడిఎంఏ పోర్టల్ లో అప్డేట్ చేయడంతో శుక్రవారం రాత్రి నుండి సి డి ఎం ఏ పోర్టల్ లో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తుల వివరాలు డిస్ప్లే అవుతున్నాయి. దీనితో కేసముద్రం బల్దియా పరిధిలోని ఆస్తుల యజమానులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా తమ ఆస్తుల మార్పిడి, క్రయవిక్రయాలు సాగించడానికి అడ్డంకి తొలగిపోయింది.
త్వరలో ఆన్లైన్లో జనన, మరణ రికార్డులు
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో జనన, మరణ రికార్డులు కూడా త్వరలో ఆన్లైన్ లో పొందుపరుస్తాం. అలాగే కేసముద్రం బల్దియా ఏర్పడక ముందు గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో నమోదైన ఆస్తుల్లో కొన్ని సిడిఎంఏ పోర్టల్ లో కనిపించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. తాము ఇచ్చిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో నమోదు చేశారా లేదా అనే అంశాన్ని మరోసారి సమగ్రంగా పరిశీలించి, పూర్తిస్థాయిలో నమోదయ్యేలా చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. :ప్రసన్న రాణి, మున్సిపల్ కమిషనర్