calender_icon.png 26 October, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శోకమే మిగిలింది

23-05-2024 12:05:00 AM

నిలువెత్తు మంటల్లో కాలుతున్న నా కొడుకు అమ్మా అని అనలేదు.. జై తెలంగాణ.. జై తెలంగాణ అన్నాడు. నా కొడుకుది గొప్ప త్యాగం. పదేండ్ల కేసీఆర్ పాలనలో నా కొడుకు వర్ధంతి, జయంతిని అధికారికంగా చేయకపోగా.. కనీసం నేను నిర్వహించిన వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా నల్లగొండ జిల్లా నాయకులు హజరుకూడా కాలేదు.

కాసోజు శ్రీకాంతాచారి.. తన శరీరం నిలువెత్తు మంటల్లో కాలుతున్నా జై తెలంగాణ నినాదాలు చేస్తూనే ఊపిరినొదిలి మలిదశ తెలంగాణోద్యమానికి కొత్త ఊపిరిలూదిన యోధుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ 2009 డిసెంబర్ 3న వీరమరణం పొందిన కాసోజు శ్రీకాంతాచారి ఆత్మబలిదానానికి 15 ఏండ్లు. ఈ క్రమంలోనే శ్రీకాంతాచారి అమరత్వాన్ని స్మరించుకోవాలనే సంకల్పంతో తెలంగాణ కోసం వీరమరణం పొందిన వీరుడిని కన్నా కాసోజు శంకర‘అమ్మ’ను ‘విజయక్రాంతి’ పలకరించింది. నాటి పరిస్థితిని తలచుకొని భావోద్వేగానికి లోనైన శంకరమ్మ తనకు శోకమే మిగిలిందంటూ నాటి ఉద్విగ్నభరిత క్షణాలను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే..

మాది నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామం. మేము బీదలం కాదు.. అలాగని మరీ ధనవంతులమూ కాదు. మా ఆయన కార్పెంటర్. నేను డీఆర్‌డీఏ కుట్టుమిషన్ కేంద్రంలో బట్టలు కుట్టేదాన్ని. ఓ నాలుగైదు ఎకరాల పొలం కూడా ఉన్నది. నాకు మొదటగా ఓ కొడుకు పుట్టిన పది రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత 1986, ఆగస్టు15 నాడు శ్రీకాంత్ పుట్టిండు. అప్పటికే ఓ కొడుకు చనిపోవడంతో శ్రీకాంత్‌ను గారాబంగా పెంచాం. శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి తెలివైనోడే. డాక్టర్ కావాలనుకున్నాడు. కానీ అన్ని డబ్బులు లేవని చెప్పి.. డిప్లమా ఇన్ ఫిజియోథెరఫిలో చేర్పించాను. ఆది నుంచి సాటి మనిషికి సాయం చేసేగుణమున్నోడు. వాడికి కొంత తెలివి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాటలు వినడం, ఊరికే తెలంగాణ గురించే మాట్లాడటం చేసేవాడు. ఈ తెలివి చదువులో చూపించమని నేను తిట్టేదాన్ని. కానీ చదవులోను ఫస్టే కావడంతో.. హైదరాబాద్‌లో నా కొడుకు మంచిగా చదువుకుంటాడనుకున్న. కానీ 2009 నవంబర్ 27వ తేదీనాడు పొద్దుగాల 8.30 గంటలప్పుడు నా చెల్లె ఫోన్ చేసి మన శ్రీకాంత్ ఎవ్వరితోనో గొడవ పడ్డాడు.. నీవు హైదరాబాద్‌కు రా.. అక్కా అన్నది. నాకు నమ్మబుద్ది ఐతలే. నన్ను హైదరాబాద్‌కు రప్పించేందుకు మా చెల్లె మజాక్ చేస్తుందనుకుని వాడేమి గొడవ పడడు.. మొన్నటి బేస్తారమే హైదరాబాద్ నుంచి వస్తిని.. మల్లేమోస్తా అని ఫోన్ పెట్టేసిన. కానీ అప్పటికే టీవీలలో వస్తుందట.. ఎల్‌బీ నగర్ చౌరస్తాలో నా కొడుకు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని తగులబడ్డాడని. టీవీలలో చూసినోళ్లు.. మా చుట్టాలు వచ్చి నా చుట్టూ గుమిగూడుతున్నారు. మా ఇంటికి గుంపులు గుంపులుగా వస్తున్నారు. నాకేమి అర్థమైతలే. కానీ వాళ్లు, వీళ్లు అనుకుంటుంటే.. నా కొడుకుకు మాత్రం ఏదో అయ్యిందనే భయం మాత్రం పట్టుకుంది. తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకున్నాడట అని ఎవ్వరో అంటుండగా నా చెవ్విన పడ్డది. నా గెండె ఒక్కసారిగా దసిల్లుమన్నది. కాళ్లు, చేతులు సల్లబడ్డాయి. ఎంతపని చేసినవురా.. నా శ్రీకాంత్ అంటూ.. కూలబడటంతో నా తలకు దెబ్బ తగిలింది.. మా ఆయన కూడా టీవీ చూసి దమ్మున నా దగ్గరకు వచ్చాడు. హైదరాబాద్ పోవాలన్నాడు. ఇగ నాకేమి గుర్తులేదు. 

సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఎల్‌బీ నగర్ చౌరస్తకు చేరుకున్నాము. కారులో ఉన్నోళ్లు.. ఇగో గీడనేనట... గీడనేనట అంటుంటే బయటకు చూసి ఆగిన.. అక్కడ దిగగానే గప్పున కమరు వాసన వచ్చింది. నన్ను అక్కడి నుంచి అపోలో దవాఖానలోని కొడుకు వద్దకు తీసుకెళ్లారు. నా కొడుకు కాలు నుంచి తల వరకు పత్తి ఉండలా బ్యాండేజీలతో చుట్టారు. ముఖం మాత్రమే కనిపిస్తున్నది. గుండెలు బాదుకుంటున్నాను.. కానీ నా నోట మాట రావడం లేదు. శ్రీకాంత్ నన్ను చూడగానే.. కన్నీళ్లు దారలుగా కారుతున్నాయి. ఎంత పని చేసినవ్ బిడ్డా.. మంట మండుతుందా..? అని నేను ఏడుస్తుంటే.. వాడేమో.. నాకేమి కాద మ్మా.. ఉద్యమం ఏమైంది..? కేసీఆర్ వచ్చిం డా..? బయట ఏమి జరుగుతుందో చెప్పు అంటున్నాడు. నాకేమి తోస్తలేదప్పుడు. బుజులు.. బుజులు ఉండే నా కొడుకు ముఖమంతా కాలడంతో తెల్లగా ఉబ్బి మాంసం ముద్దోలే మారింది. అందురూ వచ్చి నన్ను ఓదార్చుతున్నారు. ధైర్యం చెప్తున్నారు. అలా ఓ ఐదారు రోజులు గడిచింది. 2009 డిసెంబర్ 3న నా కొడుకు శ్రీకాంత్ జీవిడ్చిండు. కానీ ఈ విషయం తెలియని నేను నా కొడుకును బతికించమని కనిపించని దేవుళ్లను, కండ్ల ముందున్న డాక్టర్లను ప్రాధేయపడుతున్నాను. వచ్చిన నాయకులకు దండం పెట్టి అడిగిన నా బిడ్డను బతికించమని. కానీ.. నాకు చెప్తలేరు.. అమెరికా నుంచి డాక్టర్లు వచ్చారని చెప్పి ఉస్మానియాకు తీసుకెళ్లారు. కానీ అదేరోజు మధ్యాహ్నం పోలీసులు వచ్చి బాడీ ఎక్కడకు తీసుకెళ్తారని అడగడంతో.. నా గుండె పగిలినంతపనైంది. ఈ లోకంలో ఇక నా కొడుకు లేడని అర్థమైంది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా.. నాయకులందరూ వచ్చి నన్ను ఓదార్చుతున్నారు. కానీ నా కడుపు కోత ఎట్లా తీరుతుంది? ఉబికివస్తున్న శోకం ఎలా ఆగుతది? చెట్టంతటి కొడుకు మాకు నీడైతడనుకుంటే.. నిలువెత్తు కాల్చుకొని ప్రత్యేక తెలంగాణ కోసం వీరమరణం పొందాడు. మాకిప్పుడు శోకమే మిగిలింది. కానీ.. నాటి నుంచి నేటి వరకు నా కొడుకు శ్రీకాంతాచారి గుర్తుకు వస్తే.. నా కండ్లు తడై తాయి. నా కాళ్లు, చేతులు వణుకుతాయి. గుండె వేగంగా కొట్టుకొని భయమైతుంటది. ఒక్కోసారి చచ్చిపోవాలన్నంత బాధైతది. 

నా కొడుకు శ్రీకాంత్ అమరత్వంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. తాను రగిలించిన స్ఫూర్తి కొనసాగింది. మరికొందరు బిడ్డలు నా కొడుకుదారిలోనే అమ రులయ్యారు. చివరకు తెలంగాణ వచ్చింది. నా కొడుకు కల నెరవేరింది. కానీ నాయకులు, ప్రభుత్వాలు మాకిచ్చిన హామీలు నెరవేర్చలేదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిలువెత్తు మంటలలో కాలుతున్న నా కొడుకు అమ్మా అని అనలేదు.. జై తెలంగాణ.. జై తెలంగాణ అన్నాడు. నా కొడుకుది గొప్ప త్యాగం. పదేండ్ల కేసీఆర్ పాలనలో నా కొడుకు వర్ధం తి, జయంతిని అధికారికంగా చేయకపోగా.. కనీసం నేను నిర్వహించిన వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధు లు, ముఖ్యంగా నల్లగొండ జిల్లా నాయకులు హజరు కూడా కాలేదు. అమరవీరుల స్మార క భవనం ఆవిష్కరణ రోజు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పిలిపించారు.. కానీ ఇవ్వలేదు. కనీసం అమరవీరుల స్మారక భవనం వద్దకు కూడా నన్ను తీసుకుపోలేదు. ఎల్‌బీ నగర్ చౌరస్తాను శ్రీకాంతాచారి చౌరస్తాగా మారు స్తూ జీవో ఇచ్చారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వంత డబ్బులతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. కానీ నేటి వరకు ప్రతిష్ఠించలేదు. కనీసం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా నా కొడుకు శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించి శ్రీకాంతాచారి జయంతి (ఆగస్టు 15వ తేదీ) వరకు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన నా కొడుకు శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి శ్రీకాంతాచారి అమరత్వాన్ని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాలి. అప్పుడే శ్రీకాంతాచారి ఆత్మకు శాంతి.