3 గంటలపాటు తనిఖీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీ కేసులో మోకిల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి నివాసంలో సుమారు 3 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు.
అనంతరం తనిఖీలపై నార్సింగి ఏసీపీ రమణగౌడ్ మీడియాతో మాట్లాడారు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసు దర్యాప్తులో భాగంగానే విజయ్ మద్దూరి నివాసంలో సోదాలు నిర్వహించామని అన్నారు. ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని విజయ్ మద్దూరి పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.
అయితే ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించిన సమయంలో పోలీసులకు తన ఫోన్ ఇవ్వకుండా మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చాడు. ఈ క్రమంలో విజయ్ మద్దూరి మొబైల్ ఫోన్ కోసం తనిఖీలు చేశామన్నారు.
ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడని, పోలీసుల ముందు హాజరయ్యేందుకు హైకోర్టు రెండు రోజుల సమయం ఇచ్చిందని, కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో పోలీసులు ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిపై కేసు నమోదు నమోదైంది.