ఫైనల్లో విదర్భపై విజయం
వడోదర: దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా కర్ణాటక నిలిచింది. శనివారం వడోదర వేదికగా విదర్భతో జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కర్ణాటకకు ఇది ఐదో విజయ్ హజారే ట్రోఫీ కాగా.. ఫైనల్ చేరిన ప్రతీ సందర్భంలోనూ విజేతగా నిలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది.
స్మరణ్ రవిచంద్రన్ (101) సెంచరీ చేయగా.. క్రిష్ణన్ (78), అభినవ్ (79) రాణించారు. విదర్భ బౌలర్లలో దర్శన్, నచికేత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే (110) సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
కర్ణాటక బౌలర్లలో వాసుకి, ప్రసిధ్, అభిలాష్ తలా 3 వికెట్లు తీశారు. టోర్నీ ఆద్యంతం రాణించిన కరుణ్ నాయర్ (27) ఫైనల్లో విఫలమవ్వడం విదర్భను దెబ్బకొట్టింది. స్మరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కరుణ్ నాయర్‌కు (779 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది.