26-02-2025 11:38:37 PM
హిందీ వివాదంపై విజయ్ వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే.. కేంద్ర ప్రభుత్వాల మధ్య కొంతకాలంగా హిందీ భాష విషయమై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ తాజాగా స్పందించారు. ఈ వివాదం చిన్నపిల్లల గొడవలా ఉందంటూ ఎద్దేవా చేశారు. టీవీకే తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, బీజేపీలపై విజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ), త్రిభాష సూత్రం అమలుపై ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ, డీఎంకే రెండు పెద్ద పార్టీలైనా సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
డీఎంకే వ్యతిరేకిస్తున్న త్రిభాషా విధానాన్ని విజయ్ కూడా వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. త్రిభాషా సూత్రం అమలు చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్ల నిధులను నిలిపేవేస్తామంటూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన వార్తలపై విజయ్ స్పందించారు. బీజేపీ, డీఎంకే నిజాయతీ లేని పార్టీలని, వాటిని అధికారం నంపచి దించేయడమే మేలన్నారు. గెట్‌ఔట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టి వారిని సాగనంపడమే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి చేద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.