కర్ణాటక వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు
బీదర్ లో ఏటీఎం దొంగతనం.. దొంగల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది మృతి..
సంగారెడ్డి (విజయక్రాంతి): కర్ణాటకలోనూ ఇద్దరు పట్టణంలో పట్టపగలు కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులు జరిపి నగదు తీసుకొని పారిపోయారు. గురువారం మధ్యాహ్నం బీదర్ పట్టణంలో శివాజీ సర్కిల్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వాహనంలో సిబ్బంది రావడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో ఎస్బిఐ ఎటిఎం ఉండడంతో ఎప్పుడు జనాలతో కళకళలాడుతుంది. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వాహనంలో వచ్చిన సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు బైక్ పై వచ్చి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దొంగలు జరిపిన కాల్పుల్లో ఏటీఎం ఉద్యోగి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దొంగల కాల్పుల్లో గిరీష్ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్బిఐ ఏటీఎంలో పెట్టేందుకు తీసుకువచ్చిన రూ. 93 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. టేక్ పెట్టెలో తీసుకోవాల్సిన నగదును దొంగలు బైకుపై తీసుకొని పారిపోవడం జరిగింది. సంఘటన స్థలానికి బీదర్ ఎస్పీ ప్రదీప్ గూంటి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు
బీదర్ పట్టణంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయి కాల్పులు జరిపి నగదును తీసుకొని పారిపోవడంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్ణాటక పోలీసులు ఇచ్చిన సమాచారంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రతి రోడ్డుపై వాహనాలను తనిఖీలు నిర్వహించారు. 65వ జాతీయ రహదారి, జహీరాబాద్ బీదర్ రోడ్డుపై పోలీసులు కర్ణాటక వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు. దొంగలు కాల్పులు జరపడంతో తెలంగాణ పోలీసులు తుపాకులు చేత పట్టుకుని వాహనాలను తనిఖీలు చేశారు. సరిహద్దులు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని తనిఖీలు చేయడంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. ఇక్కడ ఏమి జరిగిందో తెలియక కొందరు వాహనదారులు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. హద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్ బీదర్ సరిహద్దులో ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులకు అప్రమత్తం చేశారు. వెంటనే పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనాల తనిఖీలు నిర్వహించారు.