డి సి పి ఓ బూర్ల మహేష్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాల్యవివాహాలపై నిఘా పెంచాలని బాలల సంరక్షణ జిల్లా అధికారి బూర్ల మహేష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడ కూడా బాల్యవివాహాలు జరగకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రభుత్వ ఉద్యోగులు, కుల పెద్దలు, పురోహితులు, పూజారులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వివాహ కార్యక్రమంలో భాగస్వాములైన అందరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలలకు పెళ్లిళ్లు చేసి వారి బంగారు జీవితాన్ని కష్టాలపాలు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేసి బాల్యవివాహాలు లేనటు వంటి జిల్లాగా పేరు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సిబ్బంది శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, చంద్రశేఖర్, జమున, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.