calender_icon.png 2 October, 2024 | 4:05 AM

కేయూలో విజిలెన్స్ దాడులు

02-10-2024 01:03:30 AM

మాజీ వీసీ అక్రమాలపై ఆరా

హనుమకొండ, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు కలకలం రేపుతున్నాయి. మాజీ వీసీ తాటికొండ రమేష్ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ బాలకోటి, సీఐ రాకేష్, ఇతర అధికారుల బృందం కేయూ పాలన భవనం చేరుకుని విచారణ చేశారు.

ప్రస్తుత ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ నరసింహాచారి, వర్సిటీ ఆడిట్, స్టేట్ లోకల్ ఆడిట్ టీంను రిజిస్ట్రార్ ఛాంబర్‌కు పిలుచుకుని అన్ని రికార్డుల గురించి ఆరా తీశారు. గతంలో నాలుగుసార్లు విజిలెన్స్ అధికారులు వర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించిన ఫైల్స్‌ను ఇప్పటి వరకు ఇవ్వని కారణంగా విజిలెన్స్ అధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్లకు సంబంధించిన సెలక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్, ఈసీ మినట్స్ గురించి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేగాకుండా ఫార్మసీ, ఇంజినీరింగ్‌లో జరిగిన పీహెచ్‌డీ అక్రమాలపై కూడా విచారించినట్లు సమాచారం.

ఈ మేరకు త్వరలో పీహెచ్‌డీ అడ్మిషన్లు చేసిన డీన్‌లను సైతం యూనివర్సిటీకి రప్పించి విచారించనున్నట్లు తెలుస్తోంది. పాత సర్వీసును అక్రమంగా కలుపుకుని రిజిస్ట్రార్ ఆర్డర్ ద్వారా ప్రమోషన్లు పొందుతున్న వారి గురించి ఆరా తీస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.