calender_icon.png 3 November, 2024 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహనపై విజిలెన్స్

19-07-2024 04:05:00 AM

వర్సిటీలో అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

కరీంనగర్, జూలై 18 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి కరీంనగర్‌లోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అక్రమాల మీద ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు, బీఎంఎస్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, సామాజిక కార్యకర్తలు, శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ ఫోరం అనేక విధాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి.

నిరసనలు చేపట్టాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ అక్రమాలను వెలికితీయడానికి మాజీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం, అతనికి అండగా నిలిచిన కొందరు ఉద్యోగుల అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టనుంది. మాజీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం మూడేళ్ల పదవీకాలంలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమ నియామకాలు, అక్రమ ప్రమోషన్లపై విచారణ చేపట్టనున్నారు. 

2008లో ప్రారంభం

శాతవాహన విశ్వవిద్యాలయం 2008 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. 2014 తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకే ఒక్క రెగ్యులర్ వీసీని 2021లో నియమించింది. గత ప్రభుత్వ పెద్దల సిఫారసుతో ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కి నాన్ టీచింగ్ సిబ్బంది నియామకంలో ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లేశంపై ఆరోపణలున్నాయి. యూజీసీ నియమ నిబంధనలకు బేఖాతరు చేస్తూ రిటైర్డ్ అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించారనే అపవాదు ఉంది. కనీస అర్హత లేకపోయినా తనకు నచ్చినవారిని ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అక్రమ సీఐఎస్ ప్రమోషన్లను ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఉన్న డాక్టర్ ఎం వరప్రసాద్‌ను యూజీసీ నియమ నిబంధనలు లేకపోయినా నియమించారని, అలాగే మరొకరిని అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్‌గా నియమించారని, లోకాయుక్తలో కేసు ఉన్నప్పటికి ఇంక్రిమెంట్లలో కోత విధించినప్పటికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పదోన్నతి ఇచ్చారని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో డాక్టర్ జయంత్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమించారు. 

జాతీయ సంస్థకు తప్పుడు నివేదిక

యూజీసీ 12బీ గుర్తింపు కోసం తప్పుడు నివేదికను సమర్పించి జాతీయ సంస్థను మోసం చేశారన్న అభియోగం కూడా మాజీ వీసీ ఎదుర్కొన్నారు. రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న తెలుగు, ఇంగ్లిష్, బాటనీ, మ్యాథమెటిక్స్‌ను 12బీ గుర్తింపు ఇచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారని, దీనివల్ల పేద, మెరిట్ విద్యార్థులకు అన్యా యం జరిగిందని విద్యార్థి సం ఘాలు పలు దఫాలుగా ఆందోళన నిర్వహించాయి. విశ్వవిద్యాల య వాహనాల కొ నుగోలు, యాక్సిడెంట్ ఖర్చుల మీ ద, చలాన్ల మీద విచారణ చేయాలని, లాగ్ బుక్‌లను పరిశీలించి దోషులను శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిటైర్డ్ ప్రొఫెసర్ జే ప్రభాకర్‌రావుని పీడీగా నియమించారు.

అలాగే పరిపాలన భవనం మొదటి అంతస్తు నిర్మాణంలో సరైన ప్రమాణాలు, నాణ్యత పాటించలేదన్న అభియోగం కూడా ఉంది. ఎగ్జామినేషన్ బ్రాంచిలో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలపై అలాగే జవాబు పత్రాలు బయటకు వెళ్లడం, పరీక్ష లేకుండానే పరీక్ష జవాబు పత్రాల స్కానింగ్ పత్రాల ప్రక్రియపై కోచింగ్ సం స్థకు నామినేటెడ్ పద్ధతిలో అప్పగించడంపై విచారణ జరపాలన్న డిమాండ్ ప్రభుత్వం ముందు  ఉంచారు. విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలపై తీసుకువచ్చిన కొత్త జీవో 122లో జరిగిన అవకతవకలపై బోధనేతర సిబ్బంది పీఎఫ్ డబ్బులను వారి ఖాతాలో జమ చేయకపోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉంది.