29-03-2025 07:00:56 PM
కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, పలిమల, మలహర్ ఐదు మండలాలలో మద్యం దుకాణదారులు సిండికేట్ గా మారి అక్రమ దందా కొనసాగిస్తున్నారని, వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కాటారం గ్రామానికి చెందిన రామిల్ల రాజబాబు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల మద్యం దుకాణాలను వేరువేరు ప్రదేశాలలో లైసెన్సులు పొంది ఉన్నప్పటికీ, వాటన్నింటిని ఒకే చోట పెట్టుకొని ఒక దుకాణం రిటైల్ షాప్ గా, మరో దుకాణం హోల్ సేల్ గా బెల్ట్ షాపులకు మద్యాన్ని అక్రమంగా అమ్మకాలు చేపడుతున్నారని రాజబాబు పేర్కొన్నారు.
కింగ్ ఫిషర్ బీ, రాయల్ స్ట్రాంగ్, ఐబి, ఓసి లాంటి బ్రాండ్ విస్కీ, బ్రాందీ క్వార్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఆదికృతమైన మద్యం వైన్ షాపులలో లభించకపోవడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెల్ట్ షాపులకు వైన్ షాపుల నుండి యదేచ్చగా మద్యం సరఫరా అవుతున్నాయని, కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులైన ఎస్ఐ, సీఐ లు కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లాగా పనిచేస్తున్నారని రాజబాబు విమర్శించారు. ఒకే దుకాణం పేరుతో జనాలను మోసం చేస్తూ, సిండికేట్ గా మారిన మద్యం దుకాణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజల పొట్ట కొడుతున్న బ్రాంధీ షాపు వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.