07-03-2025 05:44:07 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ పోలీస్, విద్యుత్ శాఖ ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటుందని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అధికారి కే. వినోద్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
కొంతమంది వ్యక్తులు విద్యుత్ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ, మీటర్ తిరగకుండా చేయగలమని చెప్పి డబ్బులు తీసుకుని, మీటర్ లోని కొన్ని వైర్లను కట్ చేసి అక్రమ చర్యలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ పోలీస్ మరియు విద్యుత్ శాఖ గుర్తించిందని, వాటిపై చర్యల్లో భాగంగా, వివిధ ప్రాంతాల్లో విజిలెన్స్ పోలీస్ మరియు విద్యుత్ శాఖ బృందాలు తనిఖీలు నిర్వహిస్తూ, దొంగతనాలను గుర్తిస్తున్నారు అని కె. వినోద్ తెలిపారు.
కావున, ప్రజలందరూ ఇలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.ఎవరికైనా ఈ విధంగా అక్రమంగా మీటర్ మార్పు చేయగలమని చెప్పిన వ్యక్తులు ఎదురైనా, ప్రజల దృష్టికి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రజల సహకారం అవసరమని అధికారులు స్పష్టం చేశారు.