* జిల్లా వ్యాప్తంగా కార్యాలయాల్లో విచారణ?
* దొంగ రిజిస్ట్రేషన్లపై కదులుతున్న డొంక!
ఖమ్మం, జనవరి 17 (విజయక్రాంతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విజయక్రాంతి దినపత్రికలో కొన్ని రోజుల క్రితం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పదించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతితోపాటు తనికెళ్ల వద్ద ఉన్న వెంచర్‌కు సంబంధించి రాత్రికి రాత్రి 90కి పైగా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన అంశాన్ని కూడా విజయక్రాంతి కథనంలో ప్రచురించింది. దీనికి స్పందించిన అధికారులు వైరా సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.
ఖమ్మం, వైరాతోపాటు మధిర, సత్తుపల్లి, ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లోనే మరికొంత మంది అవినీతి అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తున్నది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత బాధ్యులపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.