calender_icon.png 12 October, 2024 | 2:49 PM

తెలుగునేలను తేల్చిచెప్పిన మహనీయుడు విద్యానాథుడు

07-10-2024 12:00:00 AM

“విద్యాకైరవ కౌముదీం శ్రుతిశిరస్సీమంత ముక్తామణిమ్,

దారాన్ పద్మభువ స్త్రిలోక జననీం వందేగిరాం దేవతామ్‌

యత్పాదాబ్జ నమస్క్రియా స్సుకృతినాం సారస్వత ప్రక్రియా,

బీజన్యాసభువో భవంతి కవితా నాట్యైక జీవాతవః॥”

అంటూ విద్యాధి దేవతయైన ఆ సరస్వతీమాతను స్తుతిస్తూ ప్రారంభించిన రచన ‘ప్రతాపరుద్ర యశోభూషణం’. ‘ప్రతాప రుద్రీయమ్’ అనే సంస్కృత లక్షణ గ్రంథాన్ని యావద్భారత దేశానికి అందించిన మహా ఆలంకారికుడు విద్యానాథుడు.

ప్రతాపరుద్రుడే కావ్య నాయకుడు

విద్యానాథుడు రాసింది లక్షణ శాస్త్రమే కావచ్చు. కానీ, స్వయంగా లక్ష్యాలను రచించే సందర్భంలో ఆయన చూపిన కవిత్వ సంపదకూడా శక్తివంతమైందే. సాధారణంగా లక్షణ గ్రంథాల్లో లాక్షణికుడైన రచయిత లక్షణాలను చెబుతూ, లక్ష్యాలుగా తనకన్నా పూర్వమున్న మహాకవుల కావ్యాల్లోని లక్ష్యాలను చూపుతుంటారు. కానీ, కొందరు లాక్షణికులు లక్ష్యాలనుకూడా తామే రచించి వివరిస్తుంటారు.

విద్యానాథుడు కూడా ఆ పనే చేశాడు. చేసిన పని అదే కావచ్చు, అయినా అందులోనూ ఒక ప్రత్యేకతను ప్రదర్శించాడు. తాను ఎవరి ఆస్థానానికి సంబంధించిన వాడో, ఎవరు యావత్ కాకతీయ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశమంతా విస్తరింపజేశారో, స్వయంగా సంస్కృత పండితుడై సంస్కృత కృతిని వెలయింపజేశారో ఆ ప్రతాపరుద్రుడినే తన రచనకు నాయకుణ్ణి చేశాడు. అన్ని లక్ష్యాల్లో ఆయనే వర్ణించి ఒక కొత్త మార్గానికి బీజం వేశాడు.

తానే లక్ష్యాలు కూడా రాశాడు గనుక ప్రతి లక్ష్యంలోనూ విద్యానాథుడు ప్రతాపరుద్రుని గుణగణాల్ని వేనోళ్ల కీర్తించే యత్నం చేశాడు. దానివల్ల ప్రతాపరుద్రుని సమగ్ర వ్యక్తిత్వం ఆవిష్కృతమైంది. ప్రతాపరుద్రుడు సర్వసమర్థుడైన చక్రవర్తి. ఆయన కవి, పండితుడు కూడా కావడం విశేషం. ‘ఉషా రాగోదయం’, ‘సరస్వతీ విలాసం’ వంటి కృతులు రచించినట్లు కూడా తెలుస్తున్నది.

‘త్రిలింగ’మే తెలుగుగా ప్రసిద్ధి

ఆనాటి కాలపు విశేషాలతోపాటు త్రిలింగ దేశాన్ని, దాని ఉనికిని గురించి కూడా విద్యానాథుడు తెలుపుతూ-

“యైర్దేశ స్త్రిభిరేష యాతిమహతీం ఖ్యాతి త్రిలింగాఖ్యయా

యేషాం కాకతిరాజకీర్తి విభవైః కైలాస శైలాకృతాః

తేదేవాః ప్రసరత్ప్రసాద మధురా శ్రీశైల కాళేశ్వర

ద్రాక్షారామ నివాసినః ప్రతిదినం త్వచ్ఛ్రేయసే జాగ్రతు”

అనే శ్లోకం చెప్పాడు విద్యానాథుడు. ఈ నేల త్రిలింగ దేశమని వర్ణించి, తమ రాజైన ప్రతాపరుద్రుని ‘త్రిలింగ పరమేశ్వరా!’ అని కూడా సంబోధించాడు. ఈ శ్లోకంలో “ఓ త్రిలింగ పరమేశ్వరా! ఎవరిచే ఈ దేశమునకు త్రిలింగమను పేరుబడసి మిక్కిలి ఖ్యాతి చెందెనో, కాకతీయ రాజుల కీర్తి వైభవము కారణంగా ఎవరిచే ఇది తెల్లని కైలాస శైలము చేయబడెనో, తమ అనుగ్రహాన్ని వ్యాపింపజేసి కమనీయులైన శ్రీశైల, దక్షారామ,  కాళేశ్వర క్షేత్ర దైవములు ఎల్లప్పుడు నీ శ్రేయస్సు విషయంలో జాగరూకులై ఉందురు గాక” అన్నాడు.

ఇందులో ప్రస్తావితమైన శ్రీశైల, దక్షారామ, కాళేశ్వర క్షేత్రముల మధ్య దేశమే ‘త్రిలింగ’ దేశమని ప్రముఖులందరూ గుర్తించారు. అంతేకాక, ‘త్రిలింగ’ శబ్దం నుంచే తెలుగు అనే మాట స్థిరపడిందని కూడా భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయ పడ్డారు. మనదైన తెలుగు ప్రదేశం (నేల) ఏదో తేల్చి చెప్పిన మహనీయుడుగా విద్యానాథుడు ఈ రకంగా చరిత్రలో నిలిచాడు.

ఎంతో విశిష్ట గ్రంథం 

‘ప్రతాపరుద్ర యశోభూషణం’

భామహుడు, మమ్మటుడు, నాగేశభట్టు, వామనుడు, దండి వంటి మహామహా ఆలంకారికులకు నెలవైన సంస్కృత అలంకార శాస్త్రాల కోవలో విద్యానాథుడు అందించిన ‘ప్రతాపరుద్ర యశోభూషణ’ గ్రంథానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. సామాన్యంగా కనిపించే అలంకార శాస్త్ర గ్రంథాలవలె కాకుండా ఈ అలంకార శాస్త్రం కొంచెం భిన్నమైందని పండితులు భావించారు. ఈ గ్రంథంలో విద్యానాథుడు కావ్యాత్మను గురించి తన పూర్వ శాస్త్రవేత్తలు విశ్లేషించి చెప్పిన అంశాలను అంగీకరించినట్లు స్పష్టంగా ఉంది కాని, కొత్త ప్రతిపాదనలేవీ లేవు. ఈ గ్రంథానికి వున్న మరో విశిష్టత అన్ని లక్షణాలకు లక్ష్యాలన్నీ ప్రతాపరుద్రుడు కావడమే. 

ఈ గ్రంథ రచన తొమ్మిది ప్రకరణాలుగా ఉంది. ఇందులోని 9 ప్రకరణాలలో కారికలు, వృత్తి ఉదాహరణలుగా శ్లోకాలు మూడు విభాగాల్లో ఉన్నాయి. ఈ కారికలు మొత్తం 330, ఉదాహరణ శ్లోకాలు 590 ఉన్నాయి. వీటిలో 62 ప్రాకృతంలో ఉన్నాయి. ఉదాహరణ శ్లోకాల్లో రెండు, మూడుసార్లు  ఆవృత్తి నొందిన శ్లోకాలు దాదాపు 25 దాకా ఉన్నాయి.

విద్యానాథుడు తనకంటే పూర్వపు శాస్త్రగ్రంథాలను సంపూర్ణంగా అవలోఢన చేసి వాటిలోని సారాంశాన్ని చర్చించి వివరించారు. ఈ గ్రంథం ఒక ‘అలంకార శాస్త్ర సర్వస్వ సంగ్రహమ’ని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ గ్రంథమంతా ప్రతాపరుద్రుని ఔన్నత్యం తెలిపేది కావడం వల్ల కవితోసహా రాజుకూ కీర్తిదాయకమైంది. ఇందులో కవి చెప్పినట్లుగా-

“కాకతీయన కేంద్రస్య యశోభూషయితుం కృతాః

విద్యానాథ కృతిశ్చేయం స్వయం తేన విభూష్యతే ॥

అన్నమాటలు అక్షర సత్యాలే.

ఆయన గొప్ప నాటక కర్త కూడా!

విద్యానాథుడు ఈ అలంకార శాస్త్రగ్రంథం కేవలం లక్ష్య లక్షణాల కోసమే పరిమితం చేయలేదు. దానివల్ల ఇది అనేక కవిత్వ విలువలున్న శ్లోకాలతో ఒక కవితా ప్రాధాన్యం గల కావ్యంగానూ భాసిల్లిందని మహాపండితులు ఈయుణ్ణి వెంకట వీర రాఘవాచార్యులు అభిప్రాయపడ్డారు. శ్లోక రచనలో, కవిత్వ ప్రతిభలో విద్యానాథుడు సిద్ధహస్తుడే. ఎక్కడా శిథిలం కాని శైలీ విన్యాసయుతమైన శ్లోకాలు గ్రంథంలో అంతటా కనిపిస్తాయి. ఇందులోని శ్లోకాలు అమరుక కవి ముక్తక సదృశంగా ఉన్నాయని పరిశోధకుల భావన.

‘నాటకం’ చాక్షుష క్రతువు. ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్న సూక్తి నాటక రచనా ప్రాధాన్యాన్నే సూచిస్తుంది. కాళిదాసు, భవభూత్యాది మహాకవులు సుప్రసిద్ధ నాటక సాహిత్యాన్ని సృజించి, శాశ్వత కీర్తిని అందుకున్నారు. సంస్కృతంలో భరతుని ‘నాట్యశాస్త్రం’, ధనంజయుని ‘దశరూపకం’ వంటి ప్రత్యేక నాటక లక్షణాల్ని తెలిపే శాస్త్రాలే వెలువడ్డాయి.

అందుకే, విద్యానాథుడు కూడా నాటక ప్రాధాన్యం గుర్తించి, ఇందులో ప్రత్యేకంగా నాటక ప్రకరణాన్ని రచించాడు. ‘ప్రతాపరుద్ర కల్యాణము’ అనే ఒక నాటకాన్నే లక్ష్యంగా రాయడం విద్యానాథునిలోని నాటక రచనా చణత్వానికి గొప్ప ప్రమాణం.

నాటక లక్షణాలు చెప్పిన ప్రాచీన ఆలంకారికుల మార్గంలో సాగుతూనే మరిన్ని విశేషాలతో ఈ ప్రకరణాన్ని సుసంపన్నం చేసి, తాను చెప్పిన లక్ష్యాలకు అవసరమైన లక్ష్యంగా ఒక నాటకమే రాయడమంటే అదొక నూతన మార్గమే. దీనివల్లే విద్యానాథుని ఒక గొప్ప నాటక కర్తగా కూడా పరిగణించే అవకాశం కలిగింది.

వ్యాఖ్యాతృ సార్వభౌముడు

వ్యాఖ్యాతృ సార్వభౌమునిగా యశస్సు కలిగిన కోలాచల మల్లినాథసూరి మొదలైన ఎందరో వ్యాఖ్యాతలు తమ తమ వ్యాఖ్యానాలలో విద్యానాథుని ‘ప్రతాపరుద్ర యశోభూషణము’ను పేర్కొన్నారు. ఇది విద్యానాథుని శాస్త్ర పాండిత్యానికి గొప్ప నిదర్శనం. ఈయన అలంకార శాస్త్రానికి ప్రత్యేకంగా రెండు వ్యాఖ్యానాలే వచ్చాయి.

‘రత్నాపణ’ అనే వ్యాఖ్యానాన్ని రచించిన కుమారస్వామి స్వయంగా మల్లినాథసూరి కుమారుడు కావడం విశేషం. ‘రత్న శాణము’ అనే మరొక వ్యాఖ్యాన రచయిత చిలుకమఱ్ఱి తిరుమలాచార్యులు అనే పండితుడు. కుమారస్వామి రచించిన ‘రత్నాపణ’ వ్యాఖ్యానం ఎక్కువగా పండితులకే ఉకరించునని, బాలుర బోధకోసం తాను ఈ ‘రత్నశాణ’ వ్యాఖ్యను రచిస్తున్నానని చెప్పుకున్న ‘రత్నాపణే విస్తర సాధ్వసేన..’ అన్న శ్లోకం వల్ల తెలుస్తున్నది.

‘ప్రతాప రుద్రీయము’వలె ఏకనాయకాశ్రయమైన కొన్ని శాస్త్రగ్రంథాలు వెలుగుచూశాయి. అందులో ‘కృష్ణయజ్వ’ రచించిన సంస్కృత లక్షణ శాస్త్రగ్రంథం ‘అలంకార ముక్తావళి’ అనే నామాంతరం గల ‘నృసింహ భూపాలీయము’ అనే అలంకార శాస్త్రగ్రంథం. తెలుగులో భట్టుమూర్తి రచించిన ‘నరస భూపాలీయము’ కూడా ఈ మార్గంలో వెలువడింది కావడం విద్యానాథుని మార్గదర్శనం ఎంత శక్తిమంతమైందో అర్థమవుతున్నది.

సుప్రసిద్ధ విద్వన్మూర్తులైన కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు ‘ప్రతాప రుద్రీయము’ను, ‘నరస భూపాలీయము’ను ఆ రెండింటి సంబంధాలను గురించి విస్తృతమైన రీతిలో చర్చించి, ఎన్నెన్నో కొత్త విశేషాలను కూడా వివరించాడు. ఈ రకంగా విద్యానాథుడు ఆలంకారికులపై ఎంతటి ప్రభావం చూపారో తెలుపుతూ, అప్పట్లో (1931) వావిళ్ల వారు వెలువరిస్తున్న ‘త్రిలింగ’ పత్రికలో వ్యాసంగా ప్రకటించారంటేనే ఆయన ప్రతిభ తెలుస్తున్నది.

‘ప్రతాప రుద్రీయ’ కర్త విద్యానాథుడే అగస్త్యుడని ఒక వాదం కూడా కొంతకాలం సాగింది. అగస్త్యునికే ‘విద్యానాథుడు’ అనే బిరుదు ఉందని, ఇద్దరు కాదు ఒక్కరే అన్న విషయంలో కొందరు చర్చలు చేశారు. కానీ, కాలక్రమంలో ఇరువురు వేర్వేరు వ్యక్తులేనని సాహిత్యవేత్తలు నిరూపించారు.

ఈ మహా ఆలంకారికుణ్ణి గురించి ఈయుణ్ణి వేంకట వీర రాఘవాచార్యులు, డా. సంగనభట్ల నర్సయ్య వంటి ఎందరో ప్రతిభామూర్తులు పలు విధాల పరిశోధనలు చేసి, విద్యానాథునిలోని ప్రతిభను తెలుగువారికి సప్రమాణంగా తెలియజేశారు. డా. సంగనభట్ల వారు అన్నట్లు “ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతి గాంచడమేకాదు, పంచకావ్యాల వలెనే సంస్కృత విద్యార్థులకు పాఠ్యంగానూ నిలిచింది” అన్న మాటలే దీని ప్రశస్తిని వ్యక్త పరుస్తున్నాయి.

పూర్తి ప్రామాణిక గ్రంథం

కాకతీయ ప్రతాపరుద్రుని నాయకుణ్ణి చేసి విద్యానాథుడు రచించిన ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే ప్రతాపరుద్రీయమునకు సంబంధించిన అనేక గ్రంథాలు వెలువడ్డాయి. సురవరం ప్రతాపరెడ్డి తమ ‘గోలకొండ కవుల’ సంచికలో గద్వాల సంస్థానానికి చెందిన శ్రీమాన్ చిట్లూరి నారాయణాచార్యుల వారు ‘ప్రతాప రుద్రీయ సారము’ను రచించినట్లు తెలిపారు.

అదే విధంగా అపురూపమైన రీతిలో ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము’ రచించిన గణపవరపు వేంకట కవి ‘ఆంధ్ర ప్రతాప రుద్రీయము’ను రచించినట్లు తెలుస్తున్నది. కానీ, ఇది అలభ్యం. బహుశా ఇదే ‘ప్రతాప రుద్రీయము’నకు తొలి అనువాదమని పండితులు భావించారు.

తెలుగులో రచించిన ‘సర్వసమగ్ర ప్రతాప రుద్రీయము’ చెలమచెర్ల రంగాచార్య అనువదించిన ‘ఆంధ్ర ప్రతాప రుద్ర యశో భూషణము’ ఎంతో ప్రశస్త గ్రంథంగా గుర్తింపు పొందింది. దర్శనాచార్య, లాక్షణిక శిరోమణి, విద్యాభాషా ప్రవీణ వంటి అనేక బిరుదులతో భూషితులైన జమ్మలమడక మాధవరాయ శర్మ సైతం ‘ఆంధ్ర ప్రతాప రుద్రీయము’ను రచించారు. ఇదొక వ్యాఖ్యాప్రాయమైన అనువాదమని పండితుల అభిప్రాయం.

మూల శ్లోకాలకు పద్యానువాదం లేని అనువాదం. ‘ప్రతాప రుద్ర కల్యాణ’ నాటకం కూడా శర్మ వదిలేశారు. తదనంతరం ఎందరో నవీన ఆలంకరికులకు ఈ రచన ఒక మార్గసూచికగా ఉపయోగపడినా కొందరు లాక్షణికులు కొన్ని విషయాలలో విభేదించారు. కానీ, అప్పయ్య దీక్షితులు వంటి పండితులు ఎందరో వాటిని ఖండించి, విద్యానాథుని రచనను సమర్థిస్తూ ప్రమాణాలను వెలిబుచ్చడం విశేషం.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448