18-04-2025 11:37:16 PM
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఘటన
ప్రియుడి స్నేహితులతో కలిసి ఘాతూకం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో విషాదకర ఘటన జరిగింది. ఒక గృహిణి తన ప్రియుడు స్నేహితులతో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా మట్టుబెట్టింది. అనంతరం తన ప్రియుడికి వీడియోకాల్ చేసి భర్త మృతదేహాన్ని చూపించడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘రాహుల్ అనే వ్యక్తికి 17 ఏళ్ల మైనర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. శుక్రవారం షాపింగ్‌కు అని బయల్దేరిన ఈ దంపతులు మధ్యలో ఆగి రెస్టారెంట్ వద్ద భోజనం చేశారు. అనంతరం ఇరువురు బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో తన చెప్పు కిందపడిపోయిందని చెప్పడంతో రాహుల్ తన బైక్‌ను ఆపాడు. వెంటనే ఆమె ప్రియుడు యువరాజ్ స్నేహితులు వెనుక నుంచి వచ్చి పగిలిన బీరు బాటిల్‌తో 36 సార్లు పొడిచారు. దీంతో రాహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ప్రియుడు యువరాజ్‌కు వీడియోకాల్ చేసి తన భర్త మృతదేహాన్ని చూపించింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయింది’ అని ఎస్పీ దేవేంద్ర వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 13) మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు అతను తన భార్యతో చివరిసారిగా కనిపించినట్టు పేర్కొన్నారు. మైనర్ భార్య సహా ఆమె ప్రియుడు యువరాజ్, అతడి ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.