బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
యాదాద్రి భువనగిరి, మే 17 (విజయక్రాంతి) : పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో విజయం తమదేనని, మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని భువనగిరి బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం భువనగిరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ అధ్యక్షతన నియోజకవర్గ ఎన్నికల సమీక్షా, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పని చేసిన స్ఫూర్తిని శాసనమండలి ఎన్నికల్లో ప్రదర్శించి బీజేపీ పట్టభద్రుల మండలి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతినాయకుడు, కార్యకర్త ఇంటింటికి ప్రచారం చేసి పార్టీ గెలుపునకు కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. సమావేశంలో నాయకులు తాడూరి శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, బందారపు లింగస్వామి, దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్, పడాల శ్రీనివాస్, చందా మహేందర్, రత్నపురం బలరాం, ఊట్కూరి అశోక్ పాల్గొన్నారు.