ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం మందకష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీస్) మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఫలించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో 2004లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. గతంలో ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.
‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులో తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు జడ్జీలు తీర్పు చెప్పగా, జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50 శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం 2006లో చట్టం తెచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ ప్రభుత్వ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
ఎస్సీల జాబితాలో ఏదైనా సామాజిక వర్గానికి చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకే అధికారం ఉంటుందని, శాసనసభలకు కాదని చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాన్నే హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒక పిటిషనర్‌గా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.
విచారణ సమయంలో కేంద్రమూ ఉపవర్గీకరణను సమర్థించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో మోడీ హామీ నెరవేరినట్లయింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన మందకృష్ణ మాదిగ ఏ నాటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపితమయిందన్నారు. 30 ఏళ్ల తమ సుదీర్ఘ పోరాటం ఫలించిందన్నారు. తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు, వర్గీకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రధాని మోడీకి, వర్గీకరణపై తొలుత చట్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదని సమాజం మొత్తానిదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణను అందరికన్నా ముందుగా తెలంగాణలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా సుప్రీంతీర్పుపై హర్షం వ్యక్తం చేసింది. మాదిగలకు తెలంగాణలో 11 శాతం, ఏపీలో 7 శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి మార్గం సుగమమైంది.