షాపు వద్దకు చేరుకొని లబోదిబో అంటూ ఆందోళనకు దిగిన బాధితులు..
గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరిఖని బులియన్ మార్కెట్ లోని శ్రీనాథ్ జువెలర్స్ యజమాని ఒకరు బోర్డు తిప్పేశారు. తెలిసిన వ్యక్తుల వద్ద నుండి అత్యధిక వడ్డీ ఇస్తానని సుమారు రూ.10 కోట్ల వరకు అప్పులు చేశాడు. దీంతో ఒక్కొక్కరుగా అప్పులు తీర్చమని అడుగుతుండగా... గురువారం నాడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు షాపు వద్దకు చేరుకొని అక్కడే బయట నుంచి ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న గోదావరిఖని 1-టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి... అప్పు ఇచ్చినట్టుగా ఏవైనా పత్రాలు ఉంటే చట్టపరంగా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పారు. అప్పటికి బాధితులు లబోదిబోమంటూ అక్కడే బైఠాయించారు. దీంతో స్థానికులు గుమి గూడడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా ఇదే లక్ష్మీ నగర్లో.. మరికొందరు వ్యాపారులు సైతం ఐపి పెట్టి... అప్పులు ఇచ్చిన వారికి ఎగనామం పెట్టేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ వ్యాపారులు ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.