బాధితుడి ఖాతా నుంచి రూ.2.10 లక్షల లూటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా రిలయన్స్ క్యాపిటల్‌లో పర్సనల్ లోన్ అప్లు చేసుకున్న ఓ వ్యక్తికి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఫోన్ చేసి రూ. 2.10 లక్షలు దోచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(51) రిలయన్స్ క్యాపిటల్‌లో పర్సనల్ లోన్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్రమంలో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ పేరుతో సైబర్ నేరగాడు వాట్సాప్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగిని సంప్రదించాడు. లోన్ ప్రాసెస్‌లో భాగంగా ఇన్సూరెన్స్, జీఎస్టీ తదితర ప్రాసెసింగ్ ఫీజలు చెల్లించాలని చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ. 2.10 లక్షలను వారు సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు మంగళవారం సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.