calender_icon.png 4 October, 2024 | 3:03 AM

మహిళా మంత్రిపై దుర్మార్గ ప్రచారం

03-10-2024 01:14:32 AM

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిని వదలను

రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి

ఎంపీ రఘునందన్‌రావు

సంగారెడ్డి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర మహిళ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకొనేవరకు వదిలేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాలులర్పించిన అనంతరం ఆయన మీడియాతో, పార్టీ శ్రేణులతో మాట్లాడారు.

మహిళా మంత్రిని అవమానించడం తగదని, సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవారి ఇళ్లలో మహిళలను కూడా ఇలాగే అగౌరవరుస్తారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై సైబరాబాద్, దుబ్బాక, సిద్దిపేట పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు. హైడ్రాపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

హైడ్రాపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాపై ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు మరిచిపోయి, ప్రస్తుతం నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.