calender_icon.png 18 April, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి..

10-04-2025 06:25:18 PM

హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్..

సింగాపురం వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో విబ్జిఆర్-2025 ముగింపు వేడుక..

హుజురాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదవాలని, నైపుణ్యానికి పదును పెట్టుకోవాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని హుజురాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ జి  అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురంలోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన విద్యార్థి ఉత్సవం "విబ్జిఆర్ 2025" ముగింపు వేడుక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏసిపి శ్రీనివాస్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది డిగ్రీ కోర్సు అని అన్నారు.

విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్లో అత్యున్నత ప్రతిభ కనబరచాలని, అలాగే నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులకే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, బెట్టింగ్స్, రైడింగ్స్, సైబర్ నేరాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డిగ్రీలో మూడు సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తు.. అందంగా తీర్చిదిద్దుకుంటారని, లేకుంటే భవిష్యత్తు అంధకారం అయ్యే అవకాశం ఉందని అన్నారు. వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల 20 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఇందులో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం హర్షనీయమని అన్నారు. 

విద్యార్థులు ఎదగాలంటే క్రమశిక్షణ ముఖ్యమని, ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. అకాడమిక్ అడ్వైజర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షమిత మాట్లాడుతూ.. డిగ్రీ చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు కార్పోరేట్ రంగాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తే సివిల్ సర్వీసెస్ సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. సింగాపురం వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో రాబోయే కాలంలో సివిల్స్ శిక్షణ కూడా ఇస్తామని, దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్, కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.