ముషీరాబాద్,(విజయక్రాంతి): సోషల్ మీడియాలో దళిత, క్రైస్తవ మహిళలను, పాస్టర్లను అసభ్య పోస్ట్ లను పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వెటర్నరీ ఉద్యోగి నీల్ రాజును తక్షణమే అరెస్టు చేయాలని వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రఘుముద్రి పీటర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితురాలు ఎన్ఎస్ ప్రశాంతితో కలిసి మాట్లాడుతూ... గతంలో హిందూ మతంలో ఉన్న నీల్ రాజు అలియాస్ మామిడాల కనకరాజు మానసిక అనారోగ్యంతో పాస్టర్ శ్యాంసన్ ద్వారా స్వస్థత పొందారు. తిరిగి కొందరు హిందూ మతోన్మాద క్రైస్తవ సంస్థలతో కలిసి పాస్టర్లను, బిషప్ లను, దళిత, క్రైస్తవ మహిళల వీడియోలను దొంగ చాటుగా తీసి యూట్యూబ్ లలో పెడుతున్నారని ఆరోపించారు. 335 పైగా వీడియోలు పెట్టి మహిళలను గోరంగా అవమానిస్తున్నారు.
నీల్ రాజు గ్యాంగ్ పై పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేసినా కూడా పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రౌడీ షీటర్లతో కలిసి బాదితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడుతూ... వేదింపులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. తనను సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమి చేయలేడని ధీమా వ్యక్తం చేస్తూ ఖమ్మంకు చెందిన మేరి అనే పాస్టరమ్మను, క్రైస్తవ మత విశ్వాసాలను హేళనగా మాట్లాడుతున్నారని వెల్లడించారు. అసభ్యంగా వీడియోలు పెట్టడాన్ని వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున ప్రశ్నించగా తమపై నీల్ రాజు హుమాయున్ నగర్ పీఎస్ లో తప్పుడు కేసులు పెట్టారు. ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి నిందితున్ని ఉద్యోగం నుండి తొలగించి అరెస్టు చేయాలన్నారు. అలాగే అప్లోడ్ చేసిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులు తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రైస్తవ, పాస్టర్లు, దళిత క్రైస్తవ మహిళలు బాధితులతో కలిసి డిజిపి కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరించారు.