16-03-2025 12:51:19 AM
అందంగా మెరిసిపోవాలనో, ఇతరుల కన్నా నాజుగ్గా కనిపించాలనో.. కారణాలు ఏమైనా చాలామంది అమ్మాయిలు విచ్చలవిడిగా డైటింగ్ చేస్తున్నారు. త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఓవర్ డైటింగ్, క్రాష్ డైట్లు చేస్తూ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ యువతి వాటర్ డైటింగ్ చేసి చనిపోయింది. ఈ నేపథ్యంలో కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేరళకు చెందిన శ్రీనంద (18) బరువు సమస్యతో బాధపడేది. అయితే త్వరగా బరువు తగ్గడం కోసం యూట్యూబ్ వీడియోలు చూస్తూ కఠిన ఆహార నియమాలు పాటించింది. భోజనం మానేసి పూర్తిగా నీళ్లు మాత్రమే తాగింది. ఎక్సర్‌సైజులు కూడా చేసింది. ఫలితంగా శ్రీనంద 24 కేజీల బరువు తగ్గింది. ఈక్రమంలో పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిపాలైంది. 12 రోజులపాటు ఐసీయూలో ఉంచినా ఆ యువతి బతలేకపోయింది.
***
రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి స్థూలకాయం ఉంది. బరువు తగ్గేందుకు సోషల్ మీడియాలో కనిపించిన టిప్స్‌ను ఫాలో అయ్యింది. అయితే ఆహారం బదులు పండ్లు తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని భావించింది. దీంతో అధికంగా పండ్లు తీసుకుంది. పోషకాహార లోపంతో ఓ రోజు ఇంట్లో పడిపోయింది. కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆరోగ్యం బాగుపడింది.
ఇలా.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టానుసారంగా డైటింగ్, వ్యాయామాలు వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. లావుగా ఉన్నామనో, ఎవరో కామెంట్ చేశారనో, తమ శరీరాన్ని తాము అసహ్యించుకుంటుంటారు కొంతమంది. ఈ క్రమంలోనే వెంటనే బరువు తగ్గాలని స్వల్పకాలిక లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు. శరీరంపై ఒత్తిడి కలిగేలా కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. డైట్ పేరుతో తక్కువ తినడం, ఉపవాసం చేయడం వంటివీ చేస్తున్నారు. నిజానికి ఈ అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. బరువు తగ్గే విషయంలో స్వల్పకాలిక లక్ష్యాలకు బదులు దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్దేశించుకుంటేనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడదని చెబుతున్నాయి. అతిగా డైటింగ్ చేయడం వల్ల చాలా నష్టాలున్నాయంటున్నారు నిపుణులు.
ఎముకలకు చేటు!
వేగంగా బరువు తగ్గాలన్న లక్ష్యంతో తిండి మానేస్తుంటారు కొందరు. ఈ క్రమంలోనే శరీరానికి అవసరమైన క్యాలరీలు, పోషక పదార్థాలు పక్కన పెట్టేస్తుంటారు. దీనివల్ల కండరాల ద్రవ్యరాశి ఒక్కసారిగా తగ్గిపోతుంటుంది. ఆరోగ్యపరంగా ఇది అసాధారణ సంకేతమంటున్నారు నిపుణులు.
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల పరిమాణం తగ్గిపోవడం సాధారణమే అయినా.. వేగంగా బరువు తగ్గే క్రమంలో ఈ పరిస్థితి ఎదురైతే మాత్రం పలు సమస్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఎముక చుట్టూ రక్షణ కవచంలా ఉండే కండరాల పరిమాణం క్షీణించడం వల్ల ఎముకలు బలహీనపడి పోతాయి. తద్వారా అవి సులభంగా విరిగే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు.
అనేక అనారోగ్య సమస్యలు
కడుపు నిండా భోజనం చేయకుండా, కఠినమైన వ్యాయామాలు చేస్తూ త్వరగా బరువు తగ్గాలని శరీరాన్ని కష్ట పెడుతుంటారు చాలామంది. అయితే దీని ప్రభావం పరోక్షంగా మనసుపైనా పడుతుందంటున్నారు నిపుణులు. శరీరాకృతి గురించి తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, పదే పదే బరువు తగ్గాలన్న ఆలోచనలతో సతమతమైపోవడం వల్ల ప్రతికూల ఆలోచనలు మనసును ఒత్తిడిలోకి నెట్టేస్తుంటాయి.
ఫలితంగా ఆందోళన, చిరాకు వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
హార్మోన్ల అసమతుల్యత
వేగంగా బరువు తగ్గాలన్న లక్ష్యంతో కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం, సామర్థ్యానికి మించి బరువులెత్తడం, అలసట నుంచి రికవరీ కాకముందే మళ్లీ వ్యాయామాలకు పూనుకోవడం, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి వాటి వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్.. తదితర హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయి పెరిగిపోయి మానసికంగానూ పలు సమస్యలు తప్పవంటున్నారు.
బరువు తగ్గాలా..? ఇలా చేద్దాం
ప్రస్తుత లైఫ్‌స్టుల్ కారణంగా బరువు తగ్గడం అనేది సులువైన పని కాదు. అలాగని అంత కష్టం కూడా కాదు. తగ్గాలనే పట్టుదల ఉంటే చాలు ఎన్ని కేలరీలైనా కరిగించవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. పౌష్టికాహారం, వ్యాయామం, నిద్ర, నీళ్లు లాంటివి చాలా అవసరం.
వ్యాయామం తప్పనిసరి
ఏ రకమైన డైట్ పాటించినా వ్యాయామం మాత్రం తప్పనిసరి. అరగంట నుంచి గంటదాకా నడక, యోగా లాంటివి తప్పకుండా చేయాలి.
ఆహార నియమాలు
* కీరదోసకాయ, బీర, సొరలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువున్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పైగా వేసవిలో శరీరాన్ని హైడ్రేటెట్‌గా ఉంచుతాయి కూడా.
* తాజా ఆకు కూరల్లోని విటమిన్ సీ, విటమిన్‌కే ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కొత్తిమీర, పుదీనా కూడా చాలామంచిది.
* తక్కువ కేలరీలు ఉండే బీట్రూట్‌లో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గుతారు.
* క్రమంతప్పకుండా పండ్లు తినడం ద్వారా బరువు తగ్గొచ్చు. పండ్లలోని ఫైబర్, వాటర్ కంటెంట్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ద్రాక్షతో పాటు జామ పండ్లను కూడా తీసుకోవచ్చు.
* సాధారణ భోజనానికి ప్రత్యామ్నాయంగా సూప్‌లు, తేలికపాటి పదార్థాలు తీసుకోవాలి. అలాగే రోజుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చూసుకోవాలి.
* మిల్లెట్స్, ఓట్స్, మొలకలొచ్చిన గింజలు, నూనెకు బదులుగా నెయ్యి, బాదం, అవకాడో లాంటివి కూడా చాలా మంచిది.