calender_icon.png 18 November, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుముఖ ప్రజ్ఞాశాలి!

04-11-2024 12:00:00 AM

బాలీవుడ్ హీరోయిన్ నూతన్ సమర్థ్ బహల్ 20వ శతాబ్ద మధ్యకాలంలో హిందీ చిత్రాలలో ఒక ఊపు ఊపేసింది. ముంబైలో పుట్టిన నూతన్ బాల్యనటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలు లెక్కలేనన్ని భారీ హిట్లు కొట్టాయి. పరిశ్రమకు ఆమె చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ‘పద్శశ్రీ’తో సత్కరించింది. నటిగా, గాయనిగా, కవయిత్రిగా అందరి మనసులను గెలుచుకున్నది. తన నటనతో ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. 

నూతన్ 1936 జూన్ 4వ తేదీన ముంబై ప్రెసిడెన్సీలో జన్మించారు. తల్లిదండ్రులు శోభనా సమర్థ్, కుమారసేన్ సమర్థ్. తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో ఇంట్లో ఒక చిత్రవాతావరణం ఉండేది. నూతన్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుకున్నారు. నూతన్ బాటనటిగా నటించిన తొలి చిత్రం ‘హమారా బేటి’.

ఈ చిత్రానికి దర్శకురాలు నూతన్ తల్లి శోభన సమర్థ్. తర్వాత ‘నలదమయంతి’ సినిమాలో బాలనటిగా కూడా నటించారు. స్విట్లర్లాండ్‌లో చదువు ముగించుకొని తిరిగి వచ్చాక ‘సీమా’, ‘హీరో’, ‘బరీష్’, ‘పేయింగ్ గెస్ట్’, ‘కన్హయ్య’, ‘బందిని’, ‘అనారి’, ‘కస్తూరి’, ‘పైసా మే పైసా’, ‘కర్మ’, ‘దిల్లీ కా థగ్’, ‘మిలన్’, ‘హమ్ లోగ్’, ‘నగీనా’, ‘సరస్వతీ చంద్ర’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నది. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో 80కి పైగా సినిమాల్లో నటించింది. 

తొలి మిస్ ఇండియా అవార్డు.. 

1955లో ‘సీమా’ సినిమాలో నూతన్ పోషించిన అనాథ యువతి పాత్ర ఎనలేని పేరు తెచ్చింది. బలరాజ్ సహానితో పోటీపడి నటించింది. ఈ చిత్రానికి తొలిసారి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నది. ఈ మూవీలో ‘తూ ప్యార్ కా సాగర్ హై’ పాట ఈనాటికీ రేడియోల్లో శ్రోతలను అలరిస్తూనే ఉన్నది.

బాలీవుడ్‌లో అగ్రనటులైన.. బలరాజ్ సహాని, అశోక్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్, సునీల్ దత్, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మొదలైన వారి సరసన నటించింది. ఎక్కువగా సాంప్రదాయక దుస్తులకే ప్రాధాన్యత ఇచ్చేది. అయితే ‘దిల్లీ కా థగ్’ సినిమాలో స్విమ్ సూట్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

‘సీమా’, ‘సుజాత’, ‘బందిని’, ‘మిలన్’, ‘తులసీ తేరే అంగన్‌రీ’ సినిమాల్లో నూతన్ నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నది. బాలీవుడ్ పరిశ్రమలో ఉత్తమ నటిగా అత్యధిక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని అందుకున్న ఏకైక నటి నూతన్. మిస్ ఇండియా అవార్డు అందుకున్న తొలి మహిళ నూతన్ కావడం విశేషం. 

చివరిసారిగా నూతన్.. ‘సాజన్ కి సహేలీ’, ‘మేరీ జంగ్’, ‘నామ్’ వంటి సినిమాల్లో తల్లి పాత్రను పోషించింది.   

‘బందిని’, ‘మిలన్’, ‘సౌదాగర్’ వంటి సినిమాలకుగాను ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్’ నుంచి అవార్డులు అందుకున్నది. 

బాలీవుడ్‌కు తీరని లోటు!

1960లో ‘చబిలి’ సినిమా కోసం “ఆయే మేరే హమ్సఫర్‌” పాటను స్వయంగా రాసి పాడింది. 1974లో నూతన్‌ను భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది . 2011లో రెడిఫ్.కామ్ ‘ఆల్ మూడవ గొప్పనటిగా ఎంపికచేసింది. 2010లో ఫిల్మ్‌ఫేర్ వారు నూతన్ నటనను ‘80 ఐకానిక్ ఫెర్మామెన్స్’లో చేర్చి గౌరవించారు. 1959లో లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ బహల్‌తో నూతన్ పెళ్లి జరిగింది.

వీరికి ఒక కుమారుడు. అతని పేరు మొహ్నీష్ బాష్ల్. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు. 1991లో రొమ్ము క్యాన్సర్‌తో మరణించారు. నూతన్ జ్ఞాపకార్థంగా ఐదు రూపాయల స్టాంపును విడుదల చేసింది భారత తపాలా శాఖ. ‘నూతన్ మరణం బాలీవుడ్‌కు తీరని లోటు.. నూతన్‌ను మించిన నటీమణులు ముందు ముందు రావడం కష్టమని’ సంజయ్ లీలా భన్సాలీ అన్నారు.