04-04-2025 12:47:57 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. కేసులో పూర్తి వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, కౌశిక్ రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు.
విచారణలో తొలుత అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనిపై బీఆర్ గవాయ్ స్పందిస్తూ ‘ మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి?’ అని సింఘ్వీని ప్రశ్నించారు.
న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది ఆర్యామా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావంటూ’ ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ గవాయ్.. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. మళ్లీ అలాగే వ్యవహరిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు.
అభిషేక్ సింఘ్వీ కలగజేసుకొని ప్రతిపక్షం నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలానే ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే సీఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు. అనంతరం ఇరు పక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.