calender_icon.png 27 December, 2024 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భుజంగరావు బెయిల్ కేసులో తీర్పు రిజర్వు

27-12-2024 01:58:21 AM

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు ను రిజర్వు చేస్తున్నట్టు జస్టిస్ కే సుజన గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. ఎస్‌ఐబీలో పనిచేసే వారికి సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతో ఏమీ సంబంధం ఉండదని చెప్పారు. అయి నా పిటిషనర్ ఫోన్‌ట్యాపింగ్‌కి పాల్పడ్డారని చెప్పారు. రెండో నిందితుడు ప్రణీత్‌రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పిటిషనర్ భుజంగరావు ఫోన్‌ట్యాపింగ్ విషయాలు తెలిశాయని, ఆ తర్వాతే పిటిషనర్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.

చార్జిషీట్ దాఖలు తర్వాత 26 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించామని చెప్పారు. ప్రధాన నిందితుడు, మరొక  నిందితుడు పరారీలో ఉన్నా రని, అమెరికాలో ఉన్న వాళ్లను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తు న్నారని వివరించారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. తొలుత పిటిషనర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు వాదిస్తూ..

పిటిషనర్‌ను అన్యాయంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని చెప్పారు. అరెస్టుకు కారణాలు వివరించలేదని, రిమాండ్ అన్యాయమని పేర్కొన్నారు. కేసు లో ఆధారాల సేకరణ పూర్తయ్యిందని, విషయాలన్నీ కోర్టు పరిధిలోనే ఉన్నాయని, సాక్ష్యాల తారుమారు అభియోగాలకు అవకాశం లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.