calender_icon.png 10 March, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ప్రణయ్ హత్యకేసు తీర్పు

10-03-2025 01:16:47 AM

నల్లగొండ, మార్చి 9  (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడనుంది. నల్లగొండ జిల్లా స్పెషల్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రేమ వివాహం చేసుకున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ 2018 సెప్టెంబర్ 14న  భార్య అమృతకి వెన్నునొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు.

కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో సుఫారీ గ్యాంగ్ సాయంతో ఆమె తండ్రి మారుతీరావు ఈ హత్య చేయించినట్లు ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ నిర్వహించి 2019 జూన్ 12న 1600 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.

చార్జిషీట్‌తోపాటు పోస్టుమార్టం నివేదిక, శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10కి రిజర్వు చేసింది. ప్రణయ్ హత్యకేసులో ఏ-1 మారుతీ రావు, ఏ-2 బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ, ఏ-3 అజ్ఘర్ అలీ, ఏ-4 అబ్దులా భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ- 6 శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంను చార్జిషీట్‌లో పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.

కేసు విచారణ కొనసాగుతుండగానే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ (ఏ-2) తనకు బెయిల్ మంజూరు చేయాలని 2024 నవంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో షూరిటీ సమర్పించి జిల్లా కోర్టులో బెయిల్ పొందాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం నకిలీ షూరిటీ పత్రాలతో ముగ్గురు  వ్యక్తులు నిందితుడికి సహకరించేందుకు యత్నించగా మిర్యాలగూడ పోలీసులు బెయిల్ పేపర్స్‌పై అనుమానంతో విచారణ జరిపి నకిలీవని తేల్చి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో సుభాష్ శర్మ, అస్ఘర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ఈ పరిణామాలన్నీంటి నేపథ్యంలో తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రణయ్ కుటుంబ సభ్యులు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.