calender_icon.png 22 March, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటల తూటాలు

22-03-2025 01:47:55 AM

అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా జరిగాయి. గతమెంతో ఘనకీర్తి అన్న చందంగా తమ పాలనలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చెప్పుకోగా.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అధికార పక్షం ఎదురుదాడి చేసింది. గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నిధులు మాత్రం ఖర్చు చేయలేదని ధ్వజమెత్తింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దిక్కులేదని బీఆర్‌ఎస్ ఎద్దేవా చేయగా.. మీరు చేసిన అప్పుల పాపాలు మేం మోయాల్సి వస్తున్నదని అధికార కాంగ్రెస్ విరుచుకుపడింది. 

ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం

  1. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది
  2. శాసన సభలో హరీశ్‌రావు మండిపాటు

పరిధి దాటి మాట్లాడవద్దు

  1. విద్యావంతుడైన హరీశ్ తన భాష సరిచూసుకోవాలి
  2. అడ్డగోలుగా అప్పులు చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతోందని శుక్రవారం శాసన సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్‌పై సాగిన చర్చలో ఆయ న మాట్లాడుతూ, దేశమంతా మాంద్యమంటూ ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు వల్లెవేస్తున్నారని విమర్శించారు.

కర్ణాటక, తమిళనాడు, సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ మాంద్యం లేదని, తెలంగాణలో మాత్రం మాంద్యం పేరిట తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే బుద్ధిమాంద్యం, అజ్ఞానం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభ లో అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని ఆ మాటలను స్పీకర్ దృష్టికి తీసుకుపోయారు. దీనితో బుద్ధిమాంద్యం అనే వ్యాఖ్య సరికాదని.. హరీష్ రావు తన  వ్యాఖ్య వెనక్కి తీసుకోవాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఇదే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ‘తోడ్కల్ తీస్తా.. బట్టలూడతీసి కొడ్తా’ అన్న ప్పుడు ఎందుకు అడ్డుకోలేదని.. వారి వ్యాఖ్యలు తప్పు కానప్పుడు తన వ్యాఖ్య లు ఎలా తప్పవుతాయని అని హరీశ్‌రావు స్పీకర్‌తో వాదించారు.

అయితే సోషల్ మీడియా వేదికగా కొందరు అధికార, విపక్ష సభ్యులు, వారి కుటుంబాలపై అత్యంత అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడం వల్లే, వారిని ఉద్దేశించి సీఎం అలా అనాల్సి  వచ్చిందని, కానీ సభ్యుల గురించి కాదని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు సభలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని.. ఆయన మాట్లాడిన అంశాలన్నీ లెక్కలతో సహా రాసుకున్నా అన్నీ వివరిస్తానని డిఫ్యూ టీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు.

సీఎంను ఉద్దేశించి అజ్ఞానం వల్ల అంటే.. సీఎంకు జ్ఞానం లేదనా.. మాకెవరికీ జ్ఞానం లేదనా.. అని ప్రశ్నించారు. బుద్ధ్దిమాంద్యం ఉందం టూ మాపై వ్యాఖ్యలు చేస్తుంటే, స్పీకర్ చెప్తు న్నా వాదనకు దిగుతున్నారని హరీశ్‌రావు ను ఉద్దేశించి పేర్కొన్నారు. పరిధి దాటి మాట్లాడవద్దంటూ హితవు పలికారు. 

రుణమాఫీ కాలే..

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రుణమాఫీకి రూ. 49,500 కోట్లు అవసరమని తేల్చి.. ఏడాది అవినీతి చేయకుండా కడుపుకట్టుకుంటే రూ. 41వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయవచ్చని చెప్పారని కానీ గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో రూ. 31వేల కోట్ల రుణ మాఫీ చేయవచ్చని అన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ ఈ బడ్జెట్‌లో మాత్రం రూ. 20వేల కోట్లు ఇచ్చామని చెప్తున్నారని, వాస్తవానికి అది రూ. 16 కోట్లు కూ డా చేరలేదన్నారు.

ఇప్పటికీ రైతులు బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. తన సిద్దిపేట నియోజకవర్గంలోనే 43,363 మంది రైతులు అప్పు తీసుకుంటే వారిలో రుణమాఫీ అయ్యింది కేవలం 20,514 మం దికి మాత్రమేనని.. రుణమాఫీ కాని రైతులు 22,849 మంది రైతులని.. ఈ అంశంపై మధిరలో అయినా సిద్దిపేటలో అయినా తాను చర్చకు సిద్ధమన్నారు. సంపూర్ణంగా రుణమాఫీ అయ్యిందంటే తాను బహిరంగ క్షమాపణకు సిద్ధమని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి..

ఆరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరిస్తామని అన్నారని.. కానీ ఎక్కడ ఒక్క ఎకరాకు కూడా అందించలేదన్నారు. 15నెలల పాలనలో పెద్దవాగు కొట్టుకుపోయిందని, ఎస్‌ఎల్‌బీసీ కూలిపోయిందన్నారు. వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయిందని, సాగర్ ఎడమ కాలువకు గండి పడిందన్నారు. సుంకిశాల కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. కృష్ణాజలాలలను అప్పనంగా ఏపీకి అప్పగించారని ఆరోపించారు. కృష్ణా జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం సెక్షన్ 3 ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. 

గురుకులాలకు గ్రహణం పట్టించారు..

కాంగ్రెస్ పాలనలో గురుకులాలు పడకేశాయని హరీశ్‌రావు అన్నారు. సరైన ఆహారం అందడంలేదని.. గురుకులాల్లో 15 నెలల్లో 83 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గురుకులాల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,913స్కూల్స్ మూత పడ్డాయని.. సర్కారు విద్యపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేమిని తెలియచేస్తుందన్నారు. 

అన్యాయం చేసిన వాళ్లను అడ్వైజర్‌గా.. 

సమైక్య రాష్ట్రంలో కృష్ణానదీ నీటి కేటాయింపుల అంశంలో ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని.. ఇప్పుడు ఆయననే రాష్ట్ర సలహాదారు గా పెట్టుకున్నారని విమర్శించారు. పక్క రా ష్ట్రం నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దేవాదులకు రూ. 6 కోట్ల బిల్లులు చెల్లించలేక రూ. 600 కోట్ల విలువైన పంటను ఎండగొట్టారన్నారు.

నీలిరంగు కథ నక్క కథ అధ్యక్షా..

తన ప్రసంగం ముగిస్తూ హరీష్ రా వు.. చిన్నయసూరి పంచతంత్రంలోని నీతి కథను చెప్పారు. ఒక నక్క ఆహారా న్ని వెతుక్కుంటూ ఊర్లోకి వచ్చిందట. అక్కడ రజకులు బట్టలకు వాడే నీలిరంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. దీంతో ఆ నక్క ఒంటి నిండా నీలిరంగు అంటుకున్నది. ఆ తర్వాత అది మళ్లీ అడవిలోకి పోయింది. నీలిరంగు నక్క ను చూసి  ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న మిగిలిన జంతువులన్నీ భయపడ్డయి.

ఇదేదో బా గుంది అనుకున్న నక్క.. నేను దేవుడు పంపిన దూతను, ఈరోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క ఎన్ని కష్టాలు పెట్టినా భరించాయి. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది. కొత్త చట్టాల గురించి చెబుతున్నది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క ఒంటికి అంటిన నీలిరంగంతా కరిగిపోయింది.

నక్క నిజస్వరూపం బయ టపడింది. మాయమాటలతో, మారు వేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలం నిలవవు అన్నది ఈ నీలిరంగు నక్క కథలో నీతి సూత్రం అధ్యక్షా.. ఈ కథలోలాగానే కాంగ్రెస్ వాళ్ల మాయ మాటలు ఎక్కువకాలం నిలవవు. 

ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ..

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ అందాలు పోటీలు నిర్వహిస్తారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ఈ సర్కారు తీరు ఉందని దుయ్యబట్టారు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల అంటూ వేమన శతకం అందుకున్నారు. ఎన్నికల ముందు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిశాయన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ హామీలిచ్చి వారిని కూడా మోసం చేసిన ఘనత ఈ సర్కారుకే దక్కిందన్నారు. కోటి మంది వ్యవసాయ కూలీలకు భరోసా అని కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తది.. 2 కాదు 4వేలు పింఛన్ అని చెప్పి, రెండు డిసెంబర్లు దాటేశారని.. మరెన్ని డిసెంబర్లు పూర్తి కావాల్నో అర్థం కావడం లేదన్నారు. 

హామీలను ఎగ్గొట్టడం, అందిన కాడికి దోచుకోవడం అన్న తీరుగా ఈ సర్కారు వ్యవహారం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఆర్థిక  వృద్ధి రేటు తగ్గిపోతోందని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందన్నారు. సీఎం చెప్పుకుంటున్న తెలంగాణ రైజింగ్ ఎక్కడుందని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా లేనేలేదన్నారు. రెండు పూర్తి స్థాయి బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన తర్వాత మోసం చేయడమే తప్ప హామీలు అమ లు చేయడం తమ విధానం కాదని కాం గ్రెస్ సర్కారు చెప్పకనే చెప్పిందన్నారు. 

ఉద్యోగ నియామకాలు అబద్ధమే..

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. కానీ వాస్తవం గా భర్తీ చేసింది 6వేలకు మించి లేవన్నారు. అంతకు ముందు తాము నోటిఫి కేషన్లు వేసి, పరీక్షలు నిర్వహించి, ఫైనల్ లిస్టు తయారుచేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే దశలో ఎన్నికల కోడ్ రావ డం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు అందిం చి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుందని తెలిపారు.

బీసీలకు సబ్ ప్లాన్ పెట్టి రూ. 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి  రూ. 11వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వం గౌడన్నలకు ఉపాధి కల్పిస్తే ఈ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా కల్లు డిపోలపై దాడులు చేసి ఉపాధిలేకుం డా చేసి గౌడన్నలను జైలుపాలు చేసిందన్నారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఈ సర్కారు ఏర్పడిన తర్వాత రూ. 5లక్షలకు పైబడి చికిత్స పొందిన వారి సంఖ్య కేవలం 200 మంది లోపేనని హరీశ్‌రావు అన్నారు. వారికి రూ. 12 కోట్ల కు మించి ఖర్చు చేయలేదన్నారు. తమ పాలనలో రూ. 5 నుంచి రూ.10 లక్షల లోపు 607 మందికి రూ. 40 కోట్లతో చికిత్స అందించామన్నారు.

హైబ్రిడ్ యా న్యుటీ రోడ్ల పేరిట కొత్త మోడల్ అంటూ పల్లెల రోడ్లకు కూడా టోల్ గేట్లు తెచ్చేందు కు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లు చెల్లించిన 40శాతం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో క్రైంరేటు పెరిగిందని డీజీపీ నివేదిక ఇచ్చారని తెలిపారు.