సీఈవోకు ఫిర్యాదు చేసిన రఘునందన్‌రావు
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫిర్యాదుచేశారు. శుక్రవారం సీఈవో వికాస్‌రాజ్‌ను రఘునందన్‌రావు కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓటుకు రూ.500 పంపిణీ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దాదాపు 20 కార్లలో గ్రామాలవారీగా లెక్కగట్టి డబ్బు పంపిణీ చేశారని చెప్పారు.
తాను ఒక కారును పట్టించానని, అందులో రూ.84 లక్షలు దొరికినట్లు వెల్లడించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా డబ్బు పంపిణీ జరిగిందని చెప్పారు. డబ్బు పంచుతున్నారని తాను సిద్దిపేట, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. సోదాల్లో దొరికిన రూ.84 లక్షలను వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కారులో నగదు దొరికిన కేసులో వెంకట్రామిరెడ్డి ఏ5గా చేర్చాలని డిమాండ్‌చేశారు. తనకు ఇక్కడ న్యాయం జరక్కపోతే అవసరమైతే ఢిల్లీకి పోతానని ఫిర్యాదులో పేర్కొన్నారు.