హైదరాబాద్ : ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూన్నాను.
తొలిసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా.అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు.
ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంటయ్య పేర్కొన్నారు.