తెలుగు వెలుగే నా ఉన్నతికి కారణం
కళారుపాలు సామాజిక పునాదులు
తెలుగు భాషకు మనమంతా వారసులం
హైదరాబాద్: భాష ఆగిపోతే.. శ్వాస ఆగిపోయినట్టే.. మాతృభాష మర్చిపోతే.. మాతృబంధం విడిచిపోయినట్టేనని మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu) అన్నారు. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించారు. మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 1992లో అప్పటి సీఎం ఎన్టీఆర్(NTR) ఈ సభలను అమెరికాలో ప్రారంభించారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆనాటి సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య.. భాషాభివృద్ధికి వారధిగా నిలుస్తోందన్నారు. కళారూపాలు సామాజిక పునాదులుగా నిలుస్తాయ.. కళారుపాల స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని వెంకయ్య పిలుపునిచ్చారు.
దేశభక్తిని ప్రేరేపించడంలో కళారుపాల పాత్ర నిరుపమానిదన్నారు. కళలు ప్రజలను కార్యోన్ముఖులను చేస్తాయని చెప్పారు. అరుదైన కళలను ముందు తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనదేనని ఆయన పేర్కొన్నారు. దేశ, విదేశాల్లోని తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడం హర్షణీయం అన్నారు. మాతృభాష.. మన సంస్కృతిని తనలో ఇముడ్చుకున్నది.. మన అమ్మభాషను మనం ప్రేమించపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? అని ప్రశ్నించారు. మాతృభాషలో మాట్లాడటం మన అలవాటుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి భాషకు ఓ ప్రత్యేకత ఉంది.. తెలుగు మరింత విలక్షణమైనదన్నారు. అలంకారాలు.. తెలుగు భాష(Telugu language)కు ఎంతో అందాన్ని తెచ్చాయని చెప్పారు. జీవిత అర్థాన్ని తెలిపే ఎన్నో సామెతలు మన భాషలో ఉన్నాయని పేర్కొన్నారు.
తెలుగు వెలుగే నా ఉన్నతికి కారణమైందని వెంకయ్య నాయుడు సూచించారు. తెలుగు ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా నిలిచిందన్నారు. ప్రపంచంలో మొదటి ఉత్తమ లిపిగా కొరియన భాష(Korean language) నిలిచింది. మన వేష, భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. తెలుగు భాషకు మనమంతా వారసులం.. మన పిల్లలకు అందించాలని పిలుపునిచ్చారు. టాగోర్, సుబ్రహ్మణ్య భారతి(Tagore, Subramania Bharati) వంటి వారు తెలుగు గొప్పదనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ఇటాలియన్ ను తెలుగు ఆఫ్ సౌత్ అని చెప్పుకునే రోజు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.