12-04-2025 03:05:06 PM
అమరావతి: తిరుపతిలోని కచ్ఛపి ఆడిటోరియంలో శనివారం ఒకే దేశం- ఒకే ఎన్నిక(One Nation, One Election) ఆంధ్రప్రదేశ్ బృందం దేశంలో ఏకకాల ఎన్నికల అవసరాన్ని వివరించడానికి, నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రభావం గురించి చర్చించడానికి ప్రత్యేక సదస్సును నిర్వహించటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu) అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆలోచన ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉన్నదే అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో అమలు చేసినదేనని గుర్తుచేశారు. కొంత మంది రాజకీయ కారణాలతో జమిలి ఎన్నికల(Jamili Election)ను వ్యతిరేకిస్తున్నాయి. వివిధ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ ప్రతిపాదన పట్ల వ్యతిరేకతలో అర్థం లేదని స్పష్టమవుతుంది. ప్రాంతీయ పార్టీలకు నష్టం చేకూర్చడానికే జమిలి ఎన్నికలను ప్రోత్సహిస్తున్నారు అన్న వాదన లో పసలేదని అర్థమవుతోందని చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని వెంకయ్య(Venkaiah Naidu) సూచించారు. పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల దీర్ఘాకాలికంగా దేశానికి, రాష్ట్రాలకు మేలు చేకూర్చే గట్టి నిర్ణయాలను తీసుకోవడానికి వీలవదన్నారు. ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుంటే రాబోయే ఎన్నికలో వ్యతిరేకత వస్తుందేమో అని వెనకడగు వేయాల్సి వస్తుంది. ప్రతిసారీ ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల సంక్షేమ పథకాల అమలులో అవరోధాలు ఏర్పడతాయి. దీనివల్ల పేదలు నష్టపోతారని వెల్లడించారు.
ఎప్పటికప్పుడు ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధులకు పంపించడం వల్ల వారి వారి రోజువారీ విధుల్లో అవాంతరాలు ఏర్పడి అభివృద్ధి, సంక్షేమం(Development, welfare) కుంటుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉండడం వల్ల పార్టీలు, నేతలు, శాసనసభ సభ్యులు, ఎంపీలు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తియుక్తులన్నింటినీ వచ్చే ఎన్నికల్లో గెలవడంపైనే దృష్టి పెడతాయి తప్పించి పరిపాలనపై కాదని వివరించారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకునే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందన్నారు. జమిలి ఎన్నికల వల్ల ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగినట్లు డేటా చెబుతోందని ఆయన తెలిపారు.
సమర్థత, ప్రభావవంతమైన పరిపాలన, సుస్థిరత, పురోగతి దిశగా పడే గొప్ప ముందడుగుగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను చూడాలన్నారు. జాతీయ ప్రయోజనాలను, సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీల నేతలు ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అధ్యయనం చేయాలని, దేశమంతా ఒక అభిప్రాయానికి రావాలన్నది తన ఆకాంక్ష అన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిస్తూ... యువత ఈ విషయాన్ని అర్థం చేసుకుని, నవ భారత నిర్మాణాన్ని ప్రారంభించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతూందన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఆయన ఆరోపించారు. అధికారం పోతే కొన్ని పార్టీలు సంయమనం కోల్పోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని వెంకయ్య విమర్శించారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలన్నారు.