రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుపరిచి శీఘ్ర దర్శనం అమలు చేశారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయంలో పూజలు నిర్వహించిన భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల రద్దీతో పట్టణంలోని బద్దిపోచమ్మ, శ్రీ భీమేశ్వర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.